సాధారణంగా… ఏ స్థాయి నాయకుడినైనా తెరాసలోకి చేర్చుకోవాలంటే సీఎం కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ నేరుగా వెళ్లి మాట్లాడిన సందర్భాలు గతంలో లేవు. కానీ, ఇప్పుడు ఒక టీడీపీ సీనియర్ నేత ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లడం విశేషం! టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మండవ వెంకటేశ్వర్రావు ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్న పరిస్థితి. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మండవను తెరాసలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం కోసమే కేసీఆర్ వెళ్లారని అంటున్నారు! అయితే, లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజులు ఉన్న సమయంలో ఆయన ఇంటికి కేసీఆర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మండవ మద్దతు ఇప్పుడు తెరాసకు అంత అవసరమా..? ఇప్పటికిప్పుడు ఆయన సాయం లేకపోతే తెరాసకు జరిగే నష్టం ఏమైనా ఉందా… ఇలాంటి చర్చ కూడా ఇప్పుడు తెరమీదికి వస్తోంది.
ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న పరిస్థితిని గమనిస్తే… అక్కడ దాదాపు 185 మంది లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. వారితో నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అక్కడి లోక్ సభ స్థానంలో తెరాసకు పరిస్థితి తలనొప్పిగా మారింది. నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 16 స్థానాలు గెలుస్తామన్న ధీమాతో కేసీఆర్ మాట్లాడుతున్నా, నిజామాబాద్ కి వచ్చేసరికి ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో ఇప్పుడు మండవ అవసరం తెరాసకు ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
నిజామాబాద్ ప్రాంతంలో మండవకి గట్టి పట్టు ఉంది. అదే జిల్లా నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందారు. ప్రస్తుతం క్రియాశీలంగా లేకపోయినా… అక్కడి ప్రజలు, రైతులు, స్థానిక నేతలతో మండవకి సత్సంబంధాలున్నాయనే అంటున్నారు. అందుకే, ఇప్పటికిప్పుడు ఆయన్ని రంగంలోకి దించి… పోటీలో ఉన్న రైతులతో మండవ ద్వారా సయోధ్య కుదుర్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయితే, ఇప్పటికిప్పుడు మండవ తెరాసలోకి చేరకపోయినా… పార్టీ నుంచి ఆయనకి మంచి ఆఫర్ ఉంటుందనీ అంటున్నారు. మండవ తెరాసలో చేరడం కూడా దాదాపు ఖాయమే. మొత్తానికి, నిజామాబాద్ లో రాజకీయంగా ఏర్పడ్డ సమస్యని కేసీఆర్ ఈవిధంగా డీల్ చేయబోతున్నట్టు అనుకోవచ్చు.