హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజుల తర్వాత ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను, ముస్లిమ్‌లకు ఇస్తున్న వరాలను ప్రకటించిన సీఎమ్, రాజకీయ అంశాలపై నోరు మెదపకపోవటం విశేషం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ ఇటీవల ఇచ్చిన విందుకు గైర్హాజరు కావటం, నిన్న రేవంత్ రెడ్డి చేసిన తీవ్రవిమర్శలు వంటి రాజకీయ అంశాలపై స్పందించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ప్రస్తావించలేదు.
ఈనెల 8న నిజాంకాలేజిలో ప్రభుత్వంతరపున భారీ ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ రంజాన్‌కు మొత్తం మీద ప్రభుత్వం రు.26కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రతి మసీదువద్ద 1,000మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాలలోకూడా ఇఫ్తార్ నిర్వహిస్తామని వెల్లడించారు. ముస్లిమ్‌లకు ఇంకా అనేక వరాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవన్నీ రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో వారిని ఆకట్టుకోవటానికేనని విశ్లేషకులు అంటున్నారు.