టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వారం పది రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలో మేధావులు, మీడియా ప్రతినిధులతో మేథోమథనం జరుపుతారు. ఆ తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సాయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు దాదాపుగా ఐదారు వందల మందికి ఆయన సాయం అందించనున్నారు. ఆప్ ముఖ్య నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితా రెడీ చేశారు. వారికి సాయం అందించేందుకు వివరాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచేకేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. కుదిరితే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్న కేసీఆర్… ఇక ప్రత్యక్ష పర్యటనలు చేయక తప్పదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోయినా… కలసి రావడానికి ఎవరూ సిద్ధపడకపోయినా ముందుకే వెళ్లాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
పట్టువదలకుండా ప్రయత్నాలు చేసి.. దేశంలో రాజకీయంగా గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా లండన్ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత దావోస్ వెళ్తారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవహారాలను చూసుకునే కేటీఆర్ కూడా నగరంలో లేని సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం టీఆర్ఎస్లోనూ ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో పరిపాలనా వ్యవహారాలను కేసీఆర్ మొత్తం సెట్ చేసి పెట్టారని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ జాతీయ రాజకీయ పర్యటనలపై టీఆర్ఎస్ వర్గాలు కూడా నమ్మకంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తరహాలో ఓ వేవ్‌ను కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తెస్తారని గట్టినమ్మకంతో ఉన్నారు.