సింగరేణి ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయానికి స్పందనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధన్యవాదాల కన్నా దండకాలు దండయాత్రలే పెద్దభాగం ఆక్రమించాయి. ఈ విజయం వల్ల కలిగిన నైతిక రాజకీయ వూతం కూడా ఇందుకో కారణం కావచ్చు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పాత్ర మరీ ముఖ్యంగా జానారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి వంటి వారి పాత్ర శూన్యమని వారు కడదాకా పదవులు పట్టుకునే వేళ్లాడారని తేల్చిపారేశారు. నెహ్రూ తెలంగాణను కలిపేస్తే, ఇందిరాగాంధీ అడిగినందుకు కాల్చిచంపితే సోనియా గాంధీ ఇస్తానంటూ 14 ఏళ్లు ఆపి 400 మంది ప్రాణాలు పోవడానికి కారణమైందని మూడు ముక్కల్లో చెప్పారు. కాంగ్రెస్ను ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్న కెసిఆర్ వ్యూహాత్మకంగానే ఇంత తీవ్రంగా దాడి చేశారన్నది స్పష్టం.
అయితే ఈ మీడియా గోష్టిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై దాడి. ఆయన అస్తిత్వాన్ని జెఎసి చైర్మన్గా నిర్వహించిన పాత్రనూ ముఖ్యమంత్రి తీసిపారేశారు. నేను తయారు చేసిన లక్షల మంది కార్యకర్తల్లో ఆయనొకరు. ఎక్కువగా వూహించుకుంటున్నాడు. బండి చక్రం కింద నడిచే కుక్క తానే నడిపిస్తున్నాననుకుంటుందట. జెఎసి పేరు పెట్టిందే నేను, ఎవరు చైర్మన్గా వున్నా నడుస్తుంది. ఈయన కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. తొక్క… టిబిజిఎస్కె గెలిస్తే సింగరేణి నాశనం అవుతుందంటాడా? ఎలా నాశనం అవుతుందో ఆయన చెప్పాలి. ఎప్పుడైనా సర్పంచిగానైనా గెలిచాడా? ఆయన పిలుపు నిచ్చారని మీడియాలో ఇస్తుంటారు గాని అందుకు ఆయన ఏమైనా జాతీయ నాయకుడా? ముఖ్యమంత్రా? ఏం వుంది? ఫిగర్ వుండాలి. ఈయన పిలుపులకు ఎప్పుడైనా 500 మంది ఎక్కడైనా వచ్చారా? కోదండరాం మొదటి నుంచి టిఆర్ఎస్వ్యతిరేకి. విషం కక్కుతాడు. మేము లేకుండానే గెలుస్తామని కాంగ్రెస్కు చెప్పి వచ్చారు. విడిగా యాత్రలు చేశాడు. అవన్నీతెలుసు గాని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన జెఎసిలో ఎవరున్నారు? ఆ ముసుగెందుకు? అంటూ కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే వూపులో ఇంకా చాలా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే అదే సమయంలో అనేక అంశాలు సోదాహరణంగా వివరించేందుకు ప్రయత్నించారు. తన అనుభవాలు చెప్పారు. వ్యక్తులను బట్టి పార్టీలు నిలబడవని, కొన్ని ఈక్వేషన్లు కండిషన్లు వుండాలని చిరంజీవి ఎన్టీఆర్ చెన్నారెడ్డి ఉదాహరణలు గుర్తు చేశారు.కులాల వారి సిద్ధాంతాలు కూడా పనిచేయవన్నారు. పరిటాల శ్రీరాం పెళ్లికి వెళ్లడంపై విమర్శలను తోసిపుచ్చారు. సుదీర్ఘమైన ఈ గోష్టిలో ఆసక్తికరమైన ఆగ్రహదాయకమైన అంశాలు ఇంకా చాలా వున్నాయి.