తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఆ తీపి కబురు ఏమిటా అని.. అటు టీఆర్ఎస్లోనే కాదు… ఇటు విపక్ష పార్టీల్లోనూ.. చర్చ జరుగుతోంది. మంత్రులకూ దీనిపై సమాచారం లేదు. దీంతో తమను అడుగుతున్నపార్టీ నేతలకు వారు ఏమీ చెప్పలేకపోతున్నారు. కానీ ఇటీవలి కాలంలో కేసీఆర్ వ్యవసాయ సమీక్షలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన నోటి వెంట “రైతు సెజ్‌లు” అనే మాట ఎక్కువగా వచ్చింది. సెజ్ అంటే స్పెషల్ ఎకనమిక్ జోన్. అది పారిశ్రామికం. రైతుల్ని ..పారిశ్రామికవేత్తలుగా చేయడానికే ఈ సెజ్‌లు ఏర్పాటు చేయబోతున్నారని.. దాని కోసం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు కోసం 500 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరించాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ భూముల్లో రైతు సెజ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రైతులతోనే ఏర్పాటు చేయిస్తారు. ప్రభుత్వం ఆర్థికంగా.. సాంకేతికంగా.. అండగా ఉండి.. ఈ యూనిట్లను ఏర్పాటు చేయిస్తుందని చెబుతున్నారు. నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా.. ఎక్కడెక్కడ ఏఏ పంటలు ఎక్కువపండుతాయో.. అక్కడ ఆ రైతు సెజ్‌లలో రైతులు యూనిట్లు పెట్టుకుంటారు.
రైస్ మిల్లులు, పత్తి జిన్నింగ్ మిల్లులు, కంది, అల్లం,వెల్లుల్లి, ప్రాసెసింగ్ యూనిట్లు ఈ సెజ్‌లలో ఉంటాయి. రైతులకు శుభవార్త చెప్పబోతున్నాము… దానికి కావల్సిన ఫైనాన్స్ కూడా వర్కవుట్ చేశామని కేసీఆర్ కొండ పోచమ్మ సాగర్ దగ్గర ప్రకటించారు. అంటే ఖచ్చితంగా.. రైతు సెజ్లేనని నమ్మకం బలపడుతోంది. అయితే.. ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇవ్వడం … పంటలు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హామీ ఇవ్వడం వంటి వంటి దేశం ” ఆశ్చర్యపోయే ” నిర్ణయాలు కూడా… కేసీఆర్ మదిలో ఉన్న తీపికబురు జాబితాలో ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు ఆ తీపి కబురు ఏమిటన్నది.. కేసీఆర్ ప్రకటిస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకూ సస్పెన్సే..!