ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత కష్టమేమీ కాదు. తాజా పరిణామాలు దీన్ని రూఢీ పరుస్తున్నాయి. పక్కా రాజకీయవేత్తయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగానే అడుగులేస్తున్నారు. తనకు చెడ్డపేరు తెచ్చే నేతలనూ, ఇబ్బందికరంగా పరిణమిస్తారనే నాయకులనూ ఆయన చాలా చాకచక్యంగా వదిలించేసుకుంటారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిందీ.. విద్యార్థులను రెచ్చగొట్టిందీ ఆయనే. విద్యార్థుల కారణంగానే ఉద్యమం ఉద్ధృతమైంది.. విజయతీరాలను చేరిందీ అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ ఎప్పటికైనా పక్కలో బల్లెమవుతారని కేసీఆర్ భావించారు. అంతే.. అధికారంలోకి వచ్చిన తరవాత ఆయన్ను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. జేఏసీలను మూసేయాలని సూచించారు. దాన్ని తిరస్కరించారు కోదండరామ్. అక్కడినుంచి ఏం జరిగిందీ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు కె.కేశవరావు టీఆర్ఎస్ లో కీలక స్థానంలో ఉన్నారు. తెలంగాణలో చోటుచేసుకున్న భూకుంభకోణంలో ఆయన పేరు కూడా బయటకొచ్చింది. దీనర్థం కెకె కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయారనే. లేకపోతే ఆయన పేరు బయటకు రాదు. ఆయన్ను కేసీఆర్ వదిలించేసుకోవాలనుకుంటున్నారు కాబట్టే పేరు వెల్లడించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటారనపిస్తోంది. తనకు కావలసినవాడైతే.. కేసీఆర్ అడ్డం పడి ఉండేవారే కదా. ఆయన పేరును బయటకు రాకుండా చూసేవారే కదా. బహుశా ఇదే విషయం ఆయనకు అవగతమైందో ఏమో కేకే కూడా చిరాగ్గా కనిపిస్తున్నారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విసుగ్గా సమాధానాలు చెప్పారు. కే్కే బాడీ లాంగ్వేజ్ కూడా తేడాగా కనిపించింది. తనను ఇరికించారనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. చట్టాలు చేసేదీ తామేననీ, తాము తప్పు చేస్తామా అని కేకే ప్రశ్నించడం దీనినే సూచిస్తోంది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో తెలంగాణలో బలపడుతుండటం.. కేసీఆర్ చర్యలను నిలదీస్తుండడం గమనార్హం. కాంగ్రెస్‌లో దీర్ఘకాలం పనిచేసిన కేకే సలహాలు దీని వెనుక ఉన్నాయని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. భవిష్యత్తులో కేకేను కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చూసినా ఆశ్చర్యం లేదు.. అదే రాజకీయం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి