అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్రం స్వాతంత్ర్య దినోత్సవ 75 ఏళ్ల వేడుకలను ఓ రేంజ్లో నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం తెచ్చింది తామే అన్నంతగా.. తామే దేశభక్తులం అన్నంతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ ఇళ్లపై దేశ ప్రజలంతా వారం రోజుల పాటు జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమం కూడా ఇందులో ఉంది. ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయడం అంటే.. ఏ రేంజ్లో భావోద్వేగం పెంచవచ్చో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. పైకి రాజకీయం లేదు కానీ..అంతర్గతంగా మాత్రం బోలెడంత ఉంది. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే.. ఆ ప్రోగ్రాంతోనే రివర్స్ కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
అజాదీకా అమృత్ మహోత్సవ్ బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. తామే నిర్వహిస్తున్నామన్నట్లుగా భారీ ఎత్తున నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తమ మార్క్ ఉండేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కావాల్సిన జాతీయ జెండాలను ప్రభుత్వమే పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్డర్స్ ఇచ్చారు. ముందుగానే తెలంగాణ ప్రభుత్వం తరపున ఇళ్లకు పంపిణీ చేయనున్నారు. చాలా రాష్ట్రాల్లో తామే పంపిణీ చేయాలని రాష్ట్రాలు అనుకోవడం లేదు. తమంతటకు తాము కొనుక్కుని ప్రజలు ఎగరవేయాలని సూచిస్తున్నారు. అయితే దీని వల్ల దేశభక్తి భావన పెరుగుతుందని.. దేశభక్తి అంటే బీజేపీ అనే మైండ్ సెంట్ లోకి జనంలోకి పంపవచ్చని వారి ఆలోచన.
దీనికి విరుగుడుగా కేసీఆర్ తామే ఆ ప్రోగ్రాంను తెలంగాణలో హైజాక్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమ పార్టీ తరపున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించనున్నారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా టీఆర్ఎస్ బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ప్లాన్ రెడీ చేసుకుంది.