తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపీ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. విశాఖపట్నంలోని శారదా పీఠంలో ఈనెల 14న జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన వెళ్తారని కొద్దిరోజుల కిందటే ప్రకటించారు. నిజానికి, కొద్దిరోజుల కిందటే ఆయన విశాఖ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే తెరాస నేత కేటీఆర్ తో ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ రెండు పార్టీలూ కలిసి పని చేస్తాయనే సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగానే జగన్, కేసీఆర్ ల భేటీ ఎప్పుడు ఉంటుందనే అంశం చర్చకు వచ్చింది. జగన్ తో సమావేశం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందని కేటీఆర్ అప్పుడు అన్నారు. దీంతో.. కేసీఆర్ తాజా పర్యటనలో ఆ సమావేశం జరుగుతుందా అనే చర్చ ఇప్పుడు తెరమీదికి వచ్చింది. కేసీఆర్ విశాఖ వస్తున్న రోజునే జగన్ గృహప్రవేశం కార్యక్రమం పెట్టుకున్నారనీ, కానీ ఇప్పుడా కార్యక్రమం రద్దు అయినట్టు సమాచారం.
ఏపీకి వచ్చిన కేసీఆర్ తో వైకాపాకి చెందిన కొంతమంది నేతలు కలుస్తారా, లేదంటే జగన్ తో భేటీ ఉంటుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం. అయితే, ఫెడరల్ ఫ్రెంట్ కి సంబంధించిన అంశమై ఏపీలోనే చర్చ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెరాస వర్గాలు అంటున్నాయి. ఈ మధ్య, దేశంలో చకచకా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కేంద్రంలో మూడో ఫ్రెంట్ కి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమితో కలిసి కాంగ్రెస్ నడిచేందుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో భాజపాయేతరం అనే వాదనే తప్ప, కాంగ్రెసేతరం కూడా అనే అంశానికి ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఫెడరల్ ప్రయత్నాల్ని మరోసారి కేసీఆర్ తెరమీదికి తేవాల్సిన అవసరం ఆయనకి ఉంది. ఇంకోపక్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో దూకుడుగా దూసుకెళ్తున్న పరిస్థితి. మరి, ఏపీ పర్యటనను తన ఫెడరల్ ఫ్రెంట్ కు వేదికగా కేసీఆర్ మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.
ఇక, వైకాపాకి కూడా ఇప్పుడు ఏపీలో ఏదో ఒక సంచలనాంశం కావాలి. అధికార పార్టీ దూకుడు పెంచేయడంతో జగన్ చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న పరిస్థితి లేకుండా పోయింది. పాదయాత్ర ముగిశాక వైకాపాలో కొంత వేగం తగ్గిన వాతావరణం కనిపిస్తోంది. కొత్త సంక్షేపథకాల అమలు, పెన్షన్ల పెంపు, కియా మోటార్స్ ప్రారంభం, రాయలసీమ జిల్లాల్లోకి సాగునీరు… ఇలాంటివన్నీ అధికార పార్టీకి మరింత ఊపు తెస్తున్నాయి. దీన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఓటర్ల జాబితా అవకతవకలు లాంటి అంశాలను తెరమీదికి తెస్తున్నా… ప్రభావం పెద్దగా ఉండటం లేదు. దీంతో వైకాపాకి కూడా ఇప్పుడో కొత్త చర్చనీయాంశం కావాలి. ఇలాంటి సమయంలో ఏపీలో కేసీఆర్ తో జగన్ భేటీ పెట్టుకుంటే… ఫోకస్ అంతా అటువైపు మళ్లే అవకాశం ఉంటుంది. మరి, కేసీఆర్ ఏపీ పర్యటనను దీనికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం జగన్ చేస్తారా లేదా చూడాలి.