ధరణి .. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల కోసం తీసుకు వచ్చిన ఈ విధానంపై రైతుల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ఏకంగా ఎన్నికల హామీనే ఇచ్చింది. దీనికి రైతుల్లో మంచి స్పందన వచ్చింది. ధరణితో రైతులు పడుతున్న అవస్తలు అన్నీ ఇన్నీ కావు. ఓ రకంగా తమ భూమి తమ పేరు మీద ఉందో లేదో లేకపోతే.. రాత్రికి రాత్రే మారిపోతుందేమో అన్న ఆందోళనకు వారు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల ఫిర్యాదులు…. పరిష్కారం కోసం చూస్తున్నాయి. రైతులు కార్యాలయాల వెంట తిరుగుతున్నారు.
అదే సమయంలో ధరణిని తీసుకు రావడానికి అసలు కారణం భూ స్కామేనని ఎక్కువ మంది జనం నమ్ముతున్నారు. రికార్డుల్లోకి ఎక్కని భూములను వివిధ పద్దతుల ద్వారా టీఆర్ఎస్ నేతలు తమ పేర్లపై మార్చుకుంటున్నారని.. అలాగే వివాదాస్పద భూముల్ని కూడా సెటిల్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి ప్రచారాలో నిజమో కానీ.. ధరణిపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి ధరణి సాఫ్ట్ వేర్ తో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వేగంగా అయిపోతున్నాయి. అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు భూ రికార్డులను మెయిన్ టెయిన్ చేసే దగ్గరే రైతులకు సమస్య వస్తోంది.
ధరణిని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తూండటం.. సమస్యల పరిష్కారంలో ఆలస్యం అవుతూండటంతో కేసీఆర్ నేరుగానే రంగంలోకి దిగారు. బహిరంగసభల్లో ధరణి గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించారు. నాగర్ కర్నూలులో ధరణినా దళారీనా తేల్చుకోవాలని ఆయన ప్రజల్ని అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దరణి లేనప్పుడు కూడా అన్ని భూ వ్యవహారాలు నడిచాయని… ధరణి వల్ల కొత్త వివాదాలొచ్చాయి కానీ… పాతవి పరిష్కారం కాలేదని రైతులంటున్నారు.
కారణం ఏదైనా ధరణి సమస్య రైతుల్లో తమపై వ్యతిరేకత పెంచిందని అనుకుంటున్న కేసీఆర్… ధరణి మంచిదని చెప్పి …రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పైనే వ్యతిరేకత పెంచాలని చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.