అనుభవమైతేనే కానీ తత్వం బోధపడదన్నట్లుగా వరుస ఓటములతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు విషయం అర్థమయింది. తన వైపు నుంచి జరిగిన లోపాలేంటో గుర్తించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అలాంటి లోపాల్లో ఒకటి క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి. క్యాడర్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ఇప్పుడు కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల పంపకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్లో నేతలు చాలా ఎక్కువగా ఉన్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే కాకుండా… ఓ రకంగా అధికార దర్పం ప్రదర్శించి కూడా పార్టీలో చేర్చుకున్నారు. అయితే అలాంటి వారిలో అత్యధికులు ఏ పదవీ లేకుండా ఖాళీగాఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో నేతల్లో అసంతృప్తి గూడుకట్టుకుపోయింది. దుబ్బాక,గ్రేటర్లో ఓటమికి ఇది కూడా ఓ కారణం అని కేసీఆర్ అంచనాకు వచ్చారు.
కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు తమను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడం, ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతోనే కేడర్ లో అసంతృప్తి రాజుకుందని భావిస్తున్నారు ముఖ్య నేతలు. దీంతో కేడర్ ను దగ్గరకు తీసుకుని వారితో ఏర్పడ్డ గ్యాప్ ను పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా, నియోజక వర్గ స్థాయి నేతలకు నిత్యం కలుసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇటీవల కేసీఆర్ తనను కలిసేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నారు. అడిగితే అపాయింట్మెంటే ఇవ్వని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌ను కలుస్తున్న వారిలో అత్యధికులు పదవుల విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పనిసరిగా పదవులు వస్తాయని తొందరపడవద్దని అందరికీ కేటీఆర్ చెబుతున్నారు.
బీజేపీ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పదవుల కోసం ఎదురు చూస్తోన్న వారు అసంతృప్తితో పార్టీ వీడకుండా టిఆర్ఎస్ చీఫ్ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆశావహుల జాబితా ని ప్రగతిభవన్ ఇప్పటికే సిద్దం చేసిందని పార్టీ లో చర్చ జోరందుకుంది. అటు ఎమ్మెల్యేలు బుజ్జగించడం,ఇటు పదవులు భర్తీ చేస్తారన్న ప్రచారంతో ఆశవహులంతా తమకు పదవులు వస్తాయని టీఆర్ఎస్ క్యాడర్ ఆశల్లో ఉంది.