ప్రాంతీయ వాది నుంచి జాతీయ వాదిగా .. రాజకీయ అవకాశాల కోసం మారిపోయిన కేసీఆర్ గతంలో చేసిన రాజకీయాల నుంచి తప్పించుకోలేరు. వాటి ఫలితాలను.. ప్రభావాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సిందే. ఆయన రాజకీయ ప్రస్థానం.. ఆంధ్రులపై ద్వేషం పెంచడం ద్వారానే సాగింది. ఆంధ్రుల్ని ఎంతలా కించపర్చాలో అంతలా కించపర్చి.. తెలంగాణ ప్రజల్లో ఓ రకమైన ఉద్వేగాన్ని నింపారు. దాంతో రాజకీయ పబ్బం గడుపుకున్నారు. గత ఎన్నికల వరకూ అదే చేశారు. మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తూందంటూ తెలంగాణ ప్రజల్ని భయపెట్టి ఇంత కాలం నడిపారు. ఇప్పుడు అవన్నీ మణిముకుటాల్లో మెడలో ఉండగానే దేశాన్ని ఉద్దరిస్తానంటూ బయలుదేరారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది.
ఏపీ ప్రజల్ని తిట్టినవాటికి సారీ చెప్పాలి !
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర హోదా సాధనలో ఆంధ్రులను బూచిగా చూపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారన్న విమర్శలు సహజంగానే ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు .. కేంద్రంగా సాగిన ఉద్యమంలో ఈ మూడింటిని ఆంధ్రోళ్లు దోచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆ క్రమంలో ఆయన పరిధి దాటి చేసిన విమర్శలు ఎన్నో ఉన్నాయి. బూతులు తిట్టారు. గతంలో ఆంధ్రుల్ని కేసీఆర్ విమర్శించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఉద్యమ సమయంలో ఆంధ్రా నేతలంటూ తెలంగాణలో దాడులకు పాల్పడిన వీడియోలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి. గుళ్లూ , గోపురాలూ.. పెళ్లి పేరంటాలకు వస్తే స్వాగతం చెబుతాం కానీ.. రాజకీయం కోసం వస్తే గతంలో కేసీఆర్ ఏం చేశారో అంతకు రెట్టింపు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లపై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలి.
ఏపీకి రావాల్సిన వాటిని ఇచ్చెయ్యాలి !
విభజన పేరుతో సుసంపన్న హైదరాబాద్ ఒక్క తెలంగాణకే పరిమితయింది. అంతేనా ఉమ్మడి సంస్థల ఆస్తులన్నీ తెలంగాణకే ఉన్నాయి. విభజించి.. ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదు. ఏపీ పాలకుల్ని బ్లాక్ మెయిల్ చేసి.. లక్షల కోట్ల ప్రజాధనాన్ని తెలంగాణ ఉంచేసుకుంది. చివరికి వాడుకున్న కరెంట్ కు బకాయిలు కూడా చెల్లించడంలేదు. ముందు ఏపీకి ఇవ్వాల్సిన వాటిని ఇచ్చేయాలి. ఆ తర్వాతే ఏపీలో రాజకీయాల కోసం అడుగు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడి ప్రజలు స్పందన .. వేరేగా ఉండే అవకాశం ఉంది.
పోలవరం సహా లెవనెత్తుతున్న వివాదాలపై క్లారిటీ ఇవ్వాలి !
తెలంగాణ ఇచ్చినందుకు ఏపీకి నికరంగా లభించింది ఒకే ఒక్క వరం పోలవరం. దానిపై తెలంగాణ పెడుతున్న లొల్లి అంతా ఇంతా కాదు. ఏడు మండలాలు మళ్లీ కావాలంటూ చేస్తున్న రచ్చ కళ్ల ముందే ఉంది. డిజైన్ మార్చాలనే సన్నాయి నొక్కులు లెక్కే లేదు. ఇప్పుడు జల వివాదాలు రెట్టింపయ్యాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పంచాయతీ తేలడం లేదు. అక్రమ ప్రాజెక్టుల పేరుతో రెండు రాష్ట్రాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ అడుగు పెట్టాలి. ఆంధ్రుల్ని కించపర్చి.. ఇప్పుడు ఆంధ్రోళ్లు కులపిచ్చిగాళ్లు…. అని వస్తే.. వాళ్ల ప్రతాపం ఏంటో చూపిస్తారు.