తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు.. ఆ అంశంపై చర్చ జరగాలని కోరడం… ఆ తర్వాత పరిణామాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కేసీఆర్ ఇలాంటి అంశాల్లో బ్యాలెన్స్‌గా ఉంటారు. ఈ సారి మాత్రం గీత దాటారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కేసీఆర్ ఎందుకు ఇంత దూకుడుగా ఉన్నారన్న సందేహం వచ్చిన అందరికీ మొదటి సమాధానం పీకే అలియాస్ ప్రశాంత్ కిషోరే గుర్తుకు వస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ టీం టీఆర్ఎస్ కోసం పని చేయడం ప్రారంభించింది. ప్రస్తుత రాజకీయాల్లో తన వ్యూహాలు ఔట్ డేటెడ్ అని పీకే సాయం తీసుకోవాలని కేసీఆర్ చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నారు. గతంలో ఢిల్లీ టూర్లో పీకే టీంతో మాట్లాడి ఫైనల్ చేసుకున్నారు. తర్వాత వాళ్లు ప్రగతి భవన్‌కు వచ్చి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అంతర్గతంగా సర్వే కూడాచేశారు. ఇప్పుడు కేసీఆర్ వారి సలహాలతోనే విజృంభించడం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ వ్యాఖ్యలకు సొంత పార్టీ వారు సమర్థిస్తారు. వ్యతిరేకించేవారు విమర్శిస్తారు. కానీ సమాజంలో ఓ చీలిక అయితే వస్తుంది. తాను పని చేయాలనుకున్న పార్టీకి మొదటగా పీకే టీం చేసే మేలు.. ఇచ్చే ఫార్ములా ఇదే. ఏపీలో ఓ కులంపై వ్యతిరేకతను ప్రజల్లో ఎలా రెచ్చగొట్టారో.. ఇప్పుడు తెలంగాణలో ఆ స్థానంలోకి రాజ్యాంగాన్ని తెచ్చే ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సమాజంలో దేనికీ వంద శాతం యాక్సెప్టెన్సీ ఉండదు. ఉండే ఆ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని సమాజంలో చీలికలు తెచ్చి రాజకీయంగా ఉపయోగపడేలా చేయడమే పీకే ప్లాన్.
కేసీఆర్ ఇప్పుడు ఆ పీకే ప్లాన్ ప్రాకరమే రంగంలోకి దిగారని చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు..విమర్శలు.. తిట్లు అందుకేనని అంటున్నారు. పీకే ప్లాన్ ప్రకారమే కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పన్నితే ఇక తెలంగాణలో అలజడి ఖాయమని అనుకోవచ్చంటున్నారు.