కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టాల్లోనూ అకౌంట్లను ఒకే సారి ఓపెన్ చేశారు. ఎక్స్ లో వరుసగా ట్వీట్లు కూడా చేస్తున్నారు.
కేసీఆర్ అప్ డేటెడ్ గా ఉండే లీడర్. ఆయనకు రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావంపై చాలా స్పష్టత ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతత్వంలో భారీ సోషల్ మీడియా నెట్ వర్క్ బీఆర్ఎస్ కు ఏర్పడింది. అయితే కేసీఆర్ కు వ్యక్తిగత సోషల్ మీడియాలో వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. సీఎంగా ఉన్నప్పుడు సీఎంవో ఆఫీసుకు ట్విట్టర్ అకౌంట్ ఉండేది తప్ప కేసీఆర్కు లేదు. సోషల్ మీడియాల్లో ఆయన ట్రెండ్ అవుతారు కానీ.. ఆయనకంటూ వ్యక్తిగత ఖాతాల్లేవు.
ఇప్పుడు రాజకీయంలో సగం ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నందున ఇక తప్పదనుకున్నారు. ఖాతాలు ప్రారంభించారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందన్నది ఎక్కువ మంది భావన. ఎందుకంటే… చంద్రబాబునాయుడుకు ఎక్స్ లో ఐదు మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. జగన్ రెడ్డికి రెండున్నర మిలియన్లు ఉన్నారు. ఇందరికీ మిలియన్ల స్థాయిలోనే ఉన్నారు. వారంతా ఆ స్థాయికి వెళ్లాక కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు బీఆర్ఎస్ సానుభూతిపరులందరూ ఫాలో అయినా హాఫ్ మిలియన్ రావడం కష్టమే. ఫాలోవర్స్ పెరగాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.