ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగాడు పుట్టాలనే పొలికేక రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్ సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలో సమాఖ్య ప్రభుత్వం రావాలనీ, దద్దన్నలూ మొద్దన్నల పార్టీలు పోవాలె అన్నారు. ‘16 సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆరూ… 2001లో కూడా దద్దన్నలు ఇట్లనే మాట్లాడారు. యాడ తెస్తవు నువ్వు తెలంగాణ ’ అన్నారని చెప్పారు. మనం 16 లేమనీ, అన్ని వ్యూహాలూ బయటకి చెప్పమన్నారు. ఆల్రడీ నూరు నూట ఇరవైమందిని జమ కట్టాననీ, మనం ఒక్కళ్లమే లేమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఏయే రాష్ట్రాలకు పోయానో ప్రజలు కనిపెట్టారనీ, వారికి ఏమేం నూరిపొయ్యాలో పోసేసినా అన్నారు. తొందరపడొద్దని చాలామందికి చెప్పాననీ, అన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయన్నారు.
రెండు జాతీయ పార్టీలూ దేశంలో ప్రజలనీ రైతులనీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు కేసీఆర్. అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులు రావాల్సి ఉందనీ, రావాలంటే రాజకీయాలు ప్రభావితం కావాలన్నారు. అటువంటి రాజకీయాల కోసం ప్రజల దీవెన కోసం మరోసారి ముందుకొచ్చా అన్నారు. ‘ఎళ్లమంటరా నన్ను జాతీయ రాజకీయాల్లోకి’ అంటూ ప్రజలను కోరారు కేసీఆర్. దేశ రాజకీయాల్లో తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలనీ, ఇద్దరు ఎంపీలతో గుద్దుడు గుద్ది తెలంగాణ ఎట్ల తెచ్చినమో, పదహారు మందిని గెలిపిస్తే అవతల 160 మందిని జమ చేసి దేశంలో అగ్గిపెట్టాలన్నారు. ఒక అద్బుతమైన భారతదేశ నిర్మాణానికి ముందుగుడు వేస్తా అన్నారు కేసీఆర్.
మరోసారి ఫెడరల్ ఫ్రెంట్ అజెండాను బయటకి తీశారు కేసీఆర్. ఇతర రాష్ట్రాలకు పోయి వచ్చాననీ, చాలామందిని సిద్ధం చేశానని అంటున్నారు! ఇంతకీ, కేసీఆర్ సిద్ధం చేసింది ఎవర్ననేదే ఇప్పుడు ప్రశ్న..? పశ్చిమ బెంగాల్ వెళ్లి, మమతా బెనర్జీని కొలిసొచ్చారు. నవీన్ పట్నాయక్ ని కలిశారు. అఖిలేష్ యాదవ్ ఓసారి హైదరాబాద్ వచ్చారు. మాయావతితో భేటీ అనుకున్నా కుదరలేదు. కేసీఆర్ అంటున్న కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంట్ కి ఈ నేతలెవ్వరూ స్పష్టమైన మద్దతు ఇచ్చింది లేదు. మరి, కేసీఆర్ నూరి పోసింది ఎవరికో..? మాయావతి, అఖిలేష్ యాదవ్ లు వారి లెక్కల్లో వారున్నారు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే కేసీఆర్ అవసరం వారికి లేనేలేదు. ఇక, మమతా బెనర్జీ… కేసీఆర్ మూల సిద్ధాంతమైన భాజపా, కాంగ్రెసేతరానికి ఆమె అనుకూలం కాదు. ఇతర పార్టీలు ఎన్నికల తరువాత తమకు డిమాండ్ చేసే శక్తి పెరుగుతుందేమో అనే అంచనాతో ఉన్నాయి. కేసీఆర్ నూరిపోసింది వైకాపా అధ్యక్షుడు జగన్ వింటారేమో తప్ప… కాంగ్రెస్, లేదా భాజపా ప్రమేయం లేని జాతీయ రాజకీయాలపై ఇప్పటికైతే నమ్మకం ఎవ్వరికీ కుదరడం లేదు. కానీ, ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు జరిగిపోయిందన్నట్టు ప్రజలకు కేసీఆర్ చెప్పేస్తున్నారు! ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చాను కాబట్టి, ఇదీ సాధ్యమే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఉద్యమం… లక్ష్యం ప్రజలది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అనేది ఒక రాజకీయం… ఇది కేసీఆర్ లక్ష్యం మాత్రమే.