దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ఏపీలోనూ మూడు రాజధానులు పెట్టేందుకు ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని చిందరవంందర చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కళ్ల ముందు ఉండగానే… అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి.. మన దేశంలో ఎందుకు ఉండకూడదనే లాజిక్ ను.. తెర ముందుకు తెచ్చారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మహారాష్ట్రలోని నాగపూర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికారు. అదే సమయంలో ఒక్క విదర్భ కాదు.. దేశంలో చాలా రాష్ట్రాలను ముక్కలు చేయాల్సి ఉందన్నారు.
దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉంటే తప్పేంటని అమెరికాలో 30 కోట్ల జనాభాకే 50 రాష్ట్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్లో ఉంటే నష్టమేంటని అంటున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్లు ఉన్నాయని తెలిపారు కేసీఆర్. బిహార్లో మిథిలాంచల్ కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని వివరించారు. భారత్లో కూడా మరో 10-15 రాష్ట్రాలు ఏర్పడితే వచ్చే నష్టమేమీ లేదు కదా అని తేల్చేశారు. కేసీఆర్ మాటలు విని .. .. బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు చేస్తుందేమోనన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
కేసీఆర్ ఒకప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారు. అప్పట్లో ఆయన మంత్రి. తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ తనకు అదే ఉపయోగపడుతుందని… ఆ ఫార్ములానే ప్రయోగిస్తున్నారు. అమెరికాను చూపిస్తూ. యాభై రాష్ట్రాల ఇండియా అనే థీమ్ తో ముందుకెళ్తారమో చూడాల్సి ఉంది.