తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో రానుంది. ఎన్నికలకు సాదాసీదాగా వెళ్లకూడదని.. మెరుపులాంటి పథకాలు ప్రకటించి వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది. కర్ణాటకలో అవే పథకాలు గెలుపు ఇవ్వడంతో ఇక్కడ కూడా ధీమాగా ఉంది. ఆ స్కీములపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ అంతకు మించిన హామీల్ని రెడీ చేస్తున్నారని అంటున్నారు.
గత ఎన్నికల్లో పింఛన్దారులు, రైతులు గెలిపించారు. ఈసారి కూడా వారే తమ పార్టీని ఆదుకుంటారని కేసీఆర్ భావిస్తున్నారు. అందువల్ల ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపు తదితరాంశాలను ఎన్నికల ప్రణాళికలో ఆయన చేర్చనున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో ఉండబోతున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ‘నిరుద్యోగ భృతి’ని ఇస్తామంటూ ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది.
దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాలు తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తాయని భావిస్తున్న సీఎం కేసీఆర్… వాటి తరహాలోనే మహిళా బంధు పథకానికి రూపకల్పన చేయబోతున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అందులో ఈ పథకాలను ఆమోదించే అవకాశం ఉంది. మేనిఫెస్టో అంటే అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పడం కాకుండా.. అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారిక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడే ప్రజలు నమ్ముతారని భావిస్తున్నారు.