ఉపఎన్నికల్లో వచ్చే ఫలితాలు …రాజకీయాన్ని ఎలా మారుస్తాయో కేసీఆర్ చాలా సార్లు చూపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన వ్యూహం ప్రకారం వచ్చిన ఉపఎన్నికలు.. రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. అలాంటిది కేసీఆర్ ఉపఎన్నికల్ని.. పాలన మధ్యలో వచ్చే ఇతర ఎన్నికల్లో తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకూ కేటీఆర్ పూర్తిగా మొత్తం దృష్టి పెట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. దుబ్బాక బాధ్యతను హరీష్ రావు తీసుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉండాలనుకోవడం లేదు. స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ గెలిచిన తీరాల్సిన ఎన్నికలుగా కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. అందుకే.. ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేశారు.
కేసీఆర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే… విద్యావంతుల్లో సర్కార్‌పై వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్ రెడ్డి…. ఆ తర్వాత గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. భారీ మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థికి పెద్దగా మద్దతు దక్కలేదు. గతంలోనూ హైదరాబాద్ – రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యావంతుల్లో తమపై వ్యతిరేక లేదని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో కోదండరాం, నాగేశ్వర్ లాంటి వారు ఉంటున్నారు. ఇతర పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. అన్ని పార్టీల మధ్య టీఆర్ఎస్ అధికార పార్టీగా తన బలాన్ని నిరూపించాల్సి నపరిస్థితి ఏర్పడింది.
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే టీఆర్ఎస్పై యువతలో ఆగ్రహం ఉందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అలాంటి అభిప్రాయం వస్తే.. మొదటికే మోసం వస్తుంది. కేసీఆర్‌కు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో… రంగంలోకి దిగుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో ఎలా చూసినా టీఆర్ఎస్కు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. హరీష్ రావు ఎలాగైనా గెలుచుకొస్తారు. కానీ అక్కడ మెజార్టీ తేడా పడినా… చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా గెలిచినా…. ఓడిపోయినట్లే రాజకీయవర్గాలు అంచనాలు వేస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా కేసీఆర్ ఇప్పటి నుండే దృష్టి పెడుతున్నారు.