తెలంగాణ అసెంబ్లీలోఈ సారి ఓ వినూత్నమైన దృశ్యం కనిపించబోతోంది. హోంశాఖ మినహా.. అన్ని శాఖల బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ నెల 22నుండి 25 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే బడ్జెట్‌పై.. కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. కేసీఆర్ దిశానిర్దేశంతో.. అధికారులు బడ్జెట్‌ను దాదాపుగా పూర్తి చేసారు. 22వ తేదీన ఉదయం పదకొండున్నర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరుసటి రోజు దీనిపై చర్చ జరగనుంది. బడ్జెట్ సమావేశాలు ఖరారైనందున మంత్రి వర్గ విస్తరణ జరిగుతుందని.. టీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. కానీ.. కేసీఆర్ తీరును పరిశీలిస్తున్న వారు మాత్రం.. నమ్మకం పెట్టుకోలేమని చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు విసర్తణ జరగపోతే ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఖాయం. ఒక వేళ విస్తరణ జరిపినప్పటికీ.. శాఖలు కేటాయించకపోయినా… కేసీఆరే బడ్జెట్ ప్రవేశ పెడతారు. అన్నింటిపై.. కేసీఆర్‌కు అవగాహన ఉంటుంది కాబట్టి.. ఇదే మంచిదని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి నెలాఖరులోగా కొత్త బడ్జెట్‌ను ఆమోదించుకోవాలి. అందుకనుగుణంగా ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున… 2019-20 సంవత్సరానికి రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకునే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ మాత్రం మధ్యంతర బడ్జెట్ కే మొగ్గు చూపుతున్నారు.
అయితే కొంత మంది ఆశావహులు మాత్రం… ముహుర్తులు చూసుకుంటున్నారు. కేసీఆర్‌కు కలసి వచ్చే ముహుర్తాలు లెక్కలేసుకుని… ఆ తేదీల్లో విస్తరణ ఉంటుందనే అంచనాలకు వస్తున్నారు. ఈ నెల 18న ఉదయం, 19న మధ్యాహ్నం, 21వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని.. వారు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల దాటిపోయినందున… మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని వారి నమ్మకం. కానీ కేసీఆర్ ఆలోచనలేమిటో మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు.