తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్… దసరాకు ముహుర్తం పెట్టారు. అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లు ప్రవేశ పెట్టే ముందే రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది. అప్పట్నుంచి రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా.. అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలని ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం..పక్కా ప్రణాళికతో ఉన్నారు. దసరా రోజు నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు.
దసరా రోజు ధరణి పోర్టల్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఈ పోర్టల్ అన్నిటికి ఆధారంగా ఉంటుంది. దసరాలోపే ఈ పోర్టల్‌కు సంబంధఇంచి అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ వినియోగంపై ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లకు ఈ లోపే శిక్షణ ఇస్తారు. వారికి విధుల్లో సహాయకంగా ఉండేందుకు ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ని నియమిస్తారు. రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలోనూ.. మార్పులు తీసుకు వస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తారు. డాక్యుమెంట్ రైటర్స్‌కు కూడా లైసెన్సులు ఇచ్చి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఆస్తులన్నింటినీ ఆన్ లైన్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రకారం.. ప్రభుత్వ యంత్రాంగం ఆన్లైన్లో లేని వాటిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. దసరాలోపే అన్ని రకాల ఆస్తుల డేటా పోర్టల్‌లో నమోదు చేసి.. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్లు ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు ప్రారంభించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అంటే మరో నెల పాటు తెలంగాణలో ఎలాంటి భూ లావాదేవీలు జరిగే అవకాశం లేదన్నమాట.