తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు మరోసారి ప్రారంభించారు. గతంలో… ఓ సారి కోల్‌కతా నుంచి.. మరోసారి ఒడిషా నుంచి… ఫ్రంట్ ప్రయత్నాలు చేసినప్పటికీ.. పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ సారి మాత్రం… కేరళ నుంచి ప్రారంభిస్తున్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇక అన్ని చోట్లా.. ఆ పార్టీ తన ప్రాభల్యం కోల్పోతూ వస్తోంది. పార్లమెంట్ సీట్ల విషయంలోనూ.. ఎన్ని గెలుచుకుంటారో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత కమ్యూనిస్టులు వచ్చే ఆ కొద్ది పాటి సీట్లు అయినా… సరే.. అత్యంత కీలకమేనన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో…కేసీఆర్.. తన మూడో విడత ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను… కమ్యూనిస్టులతో చర్చల ద్వారానే ప్రారంభిస్తున్నారు.
కేరళ చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో… కేసీఆర్ సమావేశమవుతారు. వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చేది… రాజకీయాలే. దేశ రాజకీయాలు, ఎన్నికల్లో వచ్చే ఫలితాలు, ఆ తర్వాత … ప్రభుత్వ ఏర్పాటులో.. కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా చేయడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నిజానికి కేరళలోని కమ్యూనిస్టులకు… టీఆర్ఎస్కు రాజకీయ పరంగా ఒక సారూప్యత ఉంది. ఇద్దరికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయాల్లో.. అటు కేసీఆర్ కానీ.. ఇటు పినరయి విజయన్ కానీ… రెండు పార్టీలకు.,. కేంద్రంలో మద్దతివ్వాలని అనుకోరు. ప్రాంతీయ పార్టీల కూటమినే అధికారంలోకి రావాలని… వారు కోరుకుంటారని రాజకీయవర్గాల అంచనా.
అయితే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలన్నీ.. బీజేపీ కోసమేనన్న చర్చ… గతంలో నడిచింది. ఇప్పుడు.. కూడా దేశ రాజకీయాల్లో అదే అభిప్రాయం ఉంది. నిజంగా… కేసీఆర్ కలిసే రాజకీయ నేతల్లోనూ అదే అభిప్రాయం ఉంటే మాత్రం… ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనాలు లభించకపోవచ్చు. ఎందుకంటే.. కమ్యూనిస్టులు.. ఆరు నూరైనా.. బీజేపీకి మద్దతిచ్చే ప్రయత్నం మాత్రం చేయరు. ఏ ప్రయోజనం లేకపోయినా.. బీజేపీకి అడ్డుకట్ట వేయాడనికైనా… కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో అత్యంత మాటకారి అయిన కేసీఆర్.. తన చాతుర్యంతో… కమ్యూనిస్టులను ఫెడరల్ ఫ్రంట్‌లోకి చేర్చగలిగితే… తాజా రాజకీయాల్లో అది గొప్ప మలుపవుతుంది.