ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల గెలుపు ఓటములు ఎప్పుడూ వారివి కాదు. ప్రజలవే. ప్రజలే గెలిపిస్తారు లేదా ఓడిస్తారు. హుందాగా స్వీకరించాల్సింది నేతలే. అయితే కేసీఆర్ ఓటమిని అంగీకరించలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మీడియా ముందుకు రాకపోగా సోషల్ మీడియాలో మాట వరుసకైనా కాంగ్రెస్ కు.. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.
పదేళ్లుగా సీఎంగా చేసిన ఆయన ప్రతిపక్షాలకు కొంత గౌరవం ఇవ్వాల్సి ఉంది. కానీ ఎప్పుడూ ప్రతిపక్ష నేతలను అలా చూడలేదు. తమతో సన్నిహితంగా ఉండే ప్రతిపక్ష నేతలను మాత్రమే గౌరవించేవారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అంతే ఉన్నారు. అధికారం కోల్పోయిన తరవాత విజేతల్ని, కొత్త ప్రభుత్వాన్ని అభినందించలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. వీటిని స్పోర్టివ్ గా తీసుకుని కొత్త ప్రభుత్వాలను అభినందించడం అన్నది అందరూ పాటించే సంప్రదాయం. ఎక్కడైనా ఓడిపోయిన ప్రభుత్వాధినేత కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పడం కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ చేయడం జరుగుతాయి.
కానీ కేసీఆర్ .అలాంటిదేం చేయలేదు. రేవంత్ పై కేసీఆర్ వ్యక్తిగతంగా కోపం పెట్టుకోవాల్సి నపని లేదు. రాజకీయంగా ప్రజాస్వామ్య పద్దతిలోనే రేవంత్ పోరాడారు. విజయం సాధించారు. అయినా కేసీఆర్ ఓటమిని అంగీకరించడం లేదు. చివరికి తమను నమ్మి ఓట్లేసి.. గెలిపించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి ఆర్కే చెప్పినట్లుగా ఆయన ప్రజలపై అలిగారని అనుకోవాలి.