హైదరాబాద్: సవతితల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన హైదరాబాద్ బాలిక ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సతీ సమేతంగా పరామర్శించారు. ఎల్బీ నగర్లోని గ్లోబల్ అవేర్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ కోలుకుంటున్న ప్రత్యూషను పలకరించారు. భార్య శోభ, కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకూడా ఆయనవెంట ఉన్నారు. ప్రత్యూష బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు. ఏమి చదవాలనుకుంటున్నావు, ఏమవ్వాలనుకుంటున్నావని ప్రత్యూషను అడిగారు. తన ఇంటికికూడా రావచ్చని, రెండో కూతురిలో చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆమెకు ఇల్లు కూడా ఏర్పాటు చేస్తానని, పెళ్ళి అయ్యేవరకు అన్ని బాగోగులూ చూస్తానని చెప్పారు. కలలోకూడా తనకు సవతితల్లే కనిపిస్తోందని, భయమేస్తోందని ప్రత్యూష కేసీఆర్కు చెప్పింది. ఏమీ భయపడనవసరంలేదని, తానున్నానని సీఎమ్ భరోసా ఇచ్చారు. హైకోర్టు ప్రత్యూషకేసును సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీని ఆ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాలపాటు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యూష దగ్గర గడిపారు.