తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఓనర్ కూడా. తెలంగాణ పీఠాన్ని కుమారుడికి ఇచ్చిన ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. అందు కోసం ఆయన ఫెడరల్ ఫ్రంట్ భావన తలకెత్తుకున్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి రూపకల్పన చేయాలని… తపించారు. అందు కోసం.. రెండు విడుదతలుగా పర్యటనలు జరిపారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చాయి. మరి ఫెడరల్ ప్రంట్ ఏమైంది..?
కేసీఆర్ కలిసిన వాళ్లంతా ఒక్కటయ్యారు..! కేసీఆర్ మినహా..!
కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ కోసం.. ఓ మాదిరి సీట్లు ఉన్న.. రాజకీయ పార్టీలనే ఎంచుకున్నారు. వాటిలో… తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, అజిత్ జోగి పార్టీ .. చివరిగా వైసీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. రెండు సార్లు ప్రత్యేక విమానాలేసుకుని వెళ్లి మరీ జరిపిన పర్యటనల్లో కొంత మంది నేతల్ని కలిశారు. వారంతా.. కలసి పని చేద్దామన్న ఉత్సాహన్ని ప్రదర్శించారని చెప్పుకొచ్చారు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కలిసి… కూటమిలో చేర్చుకున్నంత పని చేశారు. కానీ.. ఇప్పుడు… కేసీఆర్ కలిసిన నేతలంతా.. ఒక్కటయ్యారు. కానీ కేసీఆర్ మాత్రం అందులో లేరు. వారంతా… ఓ కూటమిగా మారారు. అన్ని ప్రాంతీయ పార్టీలే కాబట్టి… రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు సమస్య రాదు కాబట్టి వారంతా ఒక్కటయ్యారు. కాని వారితో కలిసేందుకు కేసీఆర్ సిద్ధపడలేదు.
ఫెడరల్ ఫ్రంట్ ఉనికి ఎక్కడుంది..?
కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా.. ఇటీవలి కాలంలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చాలా మాటలు మాట్లాడేస్తున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేటప్పుడు.. దేశానికి కేసీఆర్ దిశ చూపిస్తున్నారని ప్రకటించేసుకున్నారు. కేసీఆర్ బాటలో నవీన్ పట్నాయక్, ఎస్పీ, బీఎస్పీ, మమతా బెనర్జీ చివరికి జగన్ కూడా వస్తున్నారని చెప్పుకొచ్చారు. అలా చెప్పుకొచ్చిన ఒక్కరోజుకే.. కోల్ కతాలో సభ జరిగింది. అక్కడ కేటీఆర్ చెప్పిన వాళ్లంతా కనిపించారు. ఒక్క కేసీఆర్, జగన్ మినహా. మరి ఫెడరల్ ప్రంట్ ఎక్కడ ఉంది. ఇక నవీన్ పట్నాయక్.. రూటే వేరు. ఆయన కాంగ్రెసేతర.. బీజేపీయేతర మాత్రమే కాదు.. జాతీయేతర రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆయన ఒడిషా బోర్డర్ దాటి రావాలని అనుకోరు. అది కేసీఆర్ అయినా… మరొకరు అయినా.. ఆయన స్టైల్ అంతే.
బీజేపీ బీ టీంగా… కేసీఆర్, జగన్ ..!
మారిపోయిన పరిణామాలను చూస్తే… బీజేపీకి బీజేపీ బీ టీంగా.. కేసీఆర్, జగన్ .. అందరి ముందు సాక్షాత్కరించారన్న క్లారిటీ మాత్రం వస్తోంది. అదే నిజం కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ రాదు. కానీ.. ఆ మెజార్టీ ఏదో … 30 సీట్ల దగ్గర ఆగిపోతే… తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సాధించే సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టి.. తమకు కావాల్సిన పదవులు పొందవచ్చనేది.. కేసీఆర్, జగన్ ఆలోచన. అంతకు మించి వేరే దారి కూడా లేదు. అంతిమంగా వారి చూపు బీజేపీ వైపే. అంటే.. కేసీఆర్, జగన్ .. బీజేపీ బీటీమ్సే. ఇంకా కాదు అని చెప్పుకుంటే.. అది ప్రజల్ని మోసం చేయడమే..!
— సుభాష్