`ఇండ్రస్ట్రీ సమావేశాలకు నన్ను పిలవలేదు` అన్న బాలయ్య మాట – పరిశ్రమలో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యింది. బాలయ్యని పిలవకపోవడం తప్పే అని పరిశ్రమలో చాలామంది పెద్దలు తేల్చేస్తున్నారు. వాళ్లే.. `భూముల్ని పంచుకుంటున్నారా` అనే వ్యాఖ్యల్నీ తప్పుబడుతున్నారు. బాలయ్య అలా మాట్లాడాల్సింది కాదని – అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ సీనియర్ నటుడు. పరిశ్రమ మూలస్థంభాల్లో ఒకరు. అలాంటి బాలయ్యని పరిశ్రమ కీలక సమావేశాలకు పిలవకపోవడం తప్పే. చిరంజీవి ఆధ్వర్యంలోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, ఆయనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సివుంది. అయితే.. ఇప్పుడు బంతికి కేసీఆర్ వైపుకు నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ సమావేశాలకు చిరంజీవి, నాగార్జునలను లీడ్ తీసుకోమని కేసీఆరే చెప్పారని, ఆయన మాటకు అనుగుణంగానే చిరు, నాగ్లు ముందుండి నడిపించారని, కేసీఆర్ చెబితే బాలయ్యనీ మీటింగులకు పిలిచేవాళ్లమని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే.. కేసీఆర్ చెప్పకపోవడం వల్లే, బాలయ్యకి ఆహ్వానం అందలేదన్నమాట. ఈ విషయంలో చిరు, ఇతర పెద్దల తప్పేమీ లేదన్న మాట. పైగా.. బాలయ్య, నాగబాబుల వ్యాఖ్యలు పూర్తిగా వాళ్ల వ్యక్తిగతమని, దానిపై స్పందించాల్సిన అవసరం ఏమీ లేదని తమ్మారెడ్డి భరద్వాజా తేల్చేశారు. సో.. పరిస్థితులు చూస్తుంటే బాలయ్య వ్యాఖ్యల్ని సీరియస్గా పట్టించుకోకూడదని ఇండ్రస్ట్రీ పెద్దలు భావిస్తున్నారన్నమాట.