తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ఇంకా తగ్గడం లేదు! అదే దూకుడును కొనసాగిస్తున్నారు. రవాణా శాఖతో మొదలైన వివాదాన్ని అక్కడితో వదిలేస్తారేమో అనుకుంటే, రోజుకో కొత్త అంశాన్ని తలకెత్తుకుని రచ్చ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. సహచర ఎంపీతో లేఖ రాయించి.. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులను సీజ్ చేసేలా ముఖ్యమంత్రి ఆదేశించేట్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది చంద్రబాబు ప్రభుత్వ పాదర్శక పాలనకు నిదర్శనం అని కేశినేని నాని స్వయంగా ఘనంగా చెప్పుకున్నారు! కానీ, ఇప్పుడు ఇన్సూరెన్సు కంపెనీలపై పడుతున్నారు, రవాణా శాఖ కమిషనర్ కు లేఖ రాసి మరో కొత్త అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సర్వీసుల రద్దుతో నాని ఆగుతారనుకుంటే… పట్టు వదలడం లేదు. ఇంతకీ ఈ కక్ష సాధింపులు ఎవరిపైన..? ఈ దూకుడు ధోరణితో అంతిమంగా ఏం చెప్పాలనుకుంటున్నారు..?
ఆర్టీయే కార్యాలయంలో రవాణ శాఖ కమిషనర్ తో ఆ మధ్య కేశినేని నాని వివాదానికి దిగిన సంగతి తెలిసిందే. అది రచ్చరచ్చ కావడంతో నాని క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే, అక్కడి నుంచే కేశినేనికి పార్టీ అధినాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచుకున్నారని అంటున్నారు. తాను చేయని తప్పుకు తనతో క్షమాపణలు చెప్పించారన్న ఉక్రోషం ఆయన్లో బలంగా నాటుకుందని చెప్పొచ్చు. అక్కడి నుంచే ప్రైవేటు బస్సు సర్వీసులపై దృష్టి పెట్టారు. కమీషనర్ తో వివాదం తరువాత.. తాజాగా ఆయనకి ఒక లేఖ రాశారు. గతంలో జరిగిన ఓ బస్సు ప్రమాదంపై చర్యలేవంటూ కమిషనర్ ను ప్రశ్నించారు! నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఓ ట్రావెల్స్ బస్సు ఆటోనగర్ లో ప్రమాదానికి గురైంది. ఓ వ్యక్తి కూడా మరణించాడు. ఆ కేసు ఏమైందంటూ ఇప్పుడు నాని లేఖాస్త్రాన్ని సంధించారు. అంతేకాదు, బాడీలు కూడా తయారు కాని బస్సులకు ఇన్సూరెన్సులు ఎలా ఇస్తారంటూ బీమా సంస్థలపై కూడా మండిపడుతున్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు.
మొత్తానికి, కేశినేని ఇప్పటికీ ధిక్కార ధోరణిలోనే వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణాశాఖలోని సాగుతున్న బాగోతాల్ని బయటకి తీయ్యడం మంచిదే. కానీ, తనవైపు తప్పు లేదని నిరూపించుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తనతో అనవసరంగా క్షమాపణలు చెప్పించారనే కనువిప్పు పెద్దలకు కలిగించేందుకే నాని ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నాని ధిక్కార ధోరణి అడుగడుగునా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలుస్తున్నా ఆయన కూడా స్తబ్దుగానే ఉంటున్నారంటూ పార్టీలో వినిపిస్తోంది. సో… నాని కక్ష సాధింపు ఎవరైపైనా అనేది అర్థమౌతూనే ఉంది. ఈ దూకుడు ధోరణితో ఏం సాధించాలనుకుంటున్నారో కూడా అర్థమౌతూనే ఉంది కదా..!