టీడీపీలో ఎంపీ టిక్కెట్కే దిక్కు లేదు కానీ.. వైసీపీలో రెండు ఎమ్మెల్యే, ఓ ఎంపీ టిక్కెట్ ఆఫర్ తీసుకుని ఆ పార్టీలో చేరిపోతున్నారు కేశినేని నాని. విజయవాడ ఎంపీ టిక్కెట్ తో పాటు కుమార్తె శ్వేతకు విజయవాడ తూర్పు లేదా పశ్చిమ సీటు, తిరువూరులో ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన నల్లగట్ల స్వామిదాసుకు టిక్కెట్లు ఖరారు చేసేందుకు జగన్ రెడ్డి అంగీకరించడంతో ఆ పార్టీలో చేరేందుకు కేశినేని నాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
బుధవారం ఆయన ఏదో ఓ సమయంలో తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉంది. నాని వ్యవహారశైలి కారణంగా టీడీపీ ఆయనను దూరం పెట్టింది. టీడీపీకి ఆయన ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు కానీ.. రాజీనామా చేసేటప్పుడు మాత్రం తమ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. చివరికి టిక్కెట్ లే్దని క్లారిటీగా చెప్పడంతోనే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డి ఆయనకు పిలిచి పెద్దపీట వేస్తున్నారు. అయితే పార్టీలో చేరేంత వరకూ బాగానే ఉంటుంది కానీ.. తర్వాత అసలు కథ ప్రారంభమవుతుందని వైసీపీలో ఇరుక్కుపోయిన వాళ్లే సెటైర్లు వేస్తున్నారు.
కేశినేని నాని జిల్లా మొత్తం తన చేతుల్లో ఉండాలనుకుంటారని.. తాను ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తారన్న అభిప్రాయం ఉంది. విజయవాడ .. కృష్ణా జిల్లా నేతలు.. వైసీపీలోకి కేశినేని నాని రాకను వ్యతిరేకిస్తున్నారు. కానీ వారెవరూ జగన్ రెడ్డికి చెప్పేంత సాహసం చేయలేరు. ఎందుకంటే..వాళ్లకే గ్యారంటీ ఉండదు మరి.