తెలుగుదేశం పార్టీలో రెబల్ వాయిస్ కేశినేని నానిది. విజయవాడ ఎంపీగా రెండో సారి గెలిచినప్పటి నుండి ఆయన తీరు కాస్త తేడాగానే ఉంది. స్వతంత్ర వ్యక్తిత్వ అని మరొకటి ఆని ఆయన చెప్పుకుంటున్నప్పటకీ.. ఆయన తీరు పార్టీకి నష్టం చేసేలా ఉందన్న వాదన చేలా కాలంగా ఉంది. తాజాగా ఆయన మరోసారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. టీడీపీని ప్రక్షాళన చేయాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో ముగ్గురు నేతలకు టిక్కెట్లు ఇస్తే తాను పని చేయనని తేల్చి చెప్పారు. ఆ ముగ్గురిలో ఆయన సోదరుడు శివనాథ్ కూడా ఉన్నారు.
కేశినేని నాని సొంత సోదరుడు శివనాథ్ చాలా కాలంగా పాటు నాని వెంటే ఉన్నారు. గత ఎన్నికల్లో కేశినేని నానికోసం పనిచేశారు కూడా. తర్వాత ఏమయిందో కానీ ఇరువురి మధ్య పొసగడం లేదు. కేశినేని శివనాథ్ సొంతంగా విజయవాడలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ సారి కేశినేని నానికి బదులుగా టిక్కెట్ కోసం శివనాథ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేశినేని నానికి కృష్ణా జిల్లాలో చాల మంది టీడీపీ నేతలకు పడదు. ఆయన వ్యవహారశైలి చంద్రబాబు కు కూడా పలుమార్లు ఇబ్బందులు తెచ్చి పెట్టింది.
ఇప్పుడు మరోసారి ఆయన నేరుగా ప్రకటన చేసేశారు . తన సోదరుడికి సీటిస్తే పని చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. ఆయన యాక్టివ్ గా ఉంటే.. ఆయన వెనకే తిరగాలని తన వెంట ఎందుకు తిరుగుతారని టీడీపీ కార్యకర్తలను ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను టీడీపీలో చేర్చే బాధ్యతను ఆయన తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా రోజులు గడిచే కొద్దీ.. కేశినేని వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారే చాన్స్ ఉంది.