విజయవాడ ఎంపీ సీటు ఈ సారి కేశినేని నానికి కష్టమని తేలడంతో ఆయన తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆయన పార్టీకి చాలా దూరం అయ్యారు. మళ్లీ టీడీపీలోనే ఉన్నాన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీపై విమర్శలు చేస్తూ.. వైసీపీపై సైలెంట్ గా ఉంటే ఆ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతూండటంతో.. టీడీపీ అంతర్గత విషయాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాలపైనా ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తెకు విజయవాడ పశ్చిమ సీటు ఆఫర్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.దీనిపై ఆయన విజయవాడలో స్పందించారు.
తాను కానీ, తన కుటుంబ సభ్యులు ఎవరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయరని చెప్పుకొచ్చారు. తన కుమార్తె శ్వేత పోటీ చేస్తారు అనేది వాస్తవం కాదు. బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలది. నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ కోసం మాత్రమనని చెప్పుకొచ్చారు. ఈస్ట్ లేదా వెస్ట్ ఏలటానికి రాలేదు. కేవలం ప్రజాసేవకు మాత్రమే వచ్చాను. నేను దోచుకోను.. మరి ఎవరిని దోచుకోనివ్వను.. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. నేను ఎంపీగా లేకుంటే, టీడీపీలో లేకుంటే బెజవాడ పార్లమెంట్‌ను జగ్గయ్య పేట నుంచి దోచు కావచ్చని కొందరి ఆలోచన. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నానని పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్లు తనకు 17 వేలకు పైగా మెజార్టీ వచ్చిందన్నారు. పశ్చిమలో మనిషిని చూసి ఓటు వేస్తారు తప్ప పార్టీకి కాదన్నారు.
కేశినేని నాని పూర్తిగా బుద్దా వెంకన్నను టార్గెట్ చేసుకున్నారు. ఆయన పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే బుద్దా వెంకన్నకు టిక్కెట్ ఇవ్వరని తెలిసి కూడా కేశినేని ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారో టీడీపీ వర్గాలకూ అంతు చిక్కడం లేదు. మరో వైపు ఆయన సోదరుడు కేశినేని చిన్ని కూడా జోరుగా రాజకీయం చేస్తున్నారు. అది కూడా ఆయనకు నచ్చడం లేదు.