కేసినేని నాని.. విజయవాడ టీడీపీ ఎంపీ. రవాణా శాఖ అధికారులకు కీలెరిగి వాత పెట్టారు. ఆరెంజ్ ట్రావెల్స్ వివాదంలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. పరోక్షంగా టీడీపీ ప్రభుత్వానికీ చెక్ చెప్పారు. కృష్ణా జిల్లాలో ఇటీవల జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం కేసినేని నాని చేతికి ఓ అద్భుతమైన ఆయుధాన్నందించింది. రవాణా రంగంలో పేరెన్నికగన్నకేసినేని ట్రావెల్స్ మూసివేతకు దారితీసిన పరిణామాలకు ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఆయనకు అంది వచ్చింది. ప్రమాదానికి గురైన బస్సు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రిజిష్టర్ అయినది కావడం ఆయనకు మరింత బలాన్నిచ్చింది.
కొద్ది నెలల క్రితం ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వివాదంలో కేసినేని నానికీ ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనరుకు మధ్య ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొంది. కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై చేయి చేసుకునే వరకూ అది వెళ్ళింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా ఇందులో తలదూర్చారు. ఒక ఐఏఎస్‌పైనే దాడికి ప్రయత్నించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందన్న ప్రమాదాన్ని ముందే గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోనికి దిగారు. కేసినేని, బొండా ఉమలతో కమిషనర్‌కు క్షమాపణలు చెప్పించి, వివాదం నుంచి ప్రభుత్వం బయటపడేలా చర్యలు తీసుకున్నారు. అతి పెద్ద రవాణా సంస్థ అధిపతి అయిన కేసినేనికి క్షమాపణ చెప్పే పరిస్థితి ఎదురుకావడం సహజంగానే ఆగ్రహం తెప్పించింది. అంతే కేసినేని ట్రావెల్స్‌ను మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీని వెనుక అసలు కారణాలు ఎప్పటికీ బహిర్గతం కావనేది బహిరంగ రహస్యం. దేశంలోనే సురక్షితమైన ట్రావెల్స్‌గా ఆ సంస్థకు పేరుంది.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో వివాదాలు ట్రాన్స్‌పోర్టు క్యారియర్ల యజమానులకు కొత్త కాదు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్‌లోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో ఎటువంటి హడావిడి చేసిందీ అందరికీ తెలుసు. ప్రమాదాలు జరిగినప్పుడు, బస్సులపై దాడులు చేసి, సీజ్ చేసినప్పుడు ఇవి సహజం. ఆయా సందర్భాలలో వారో వీరో ఎవరో ఒకరు సద్దుకుపోయారు కాబట్టి గొడవలు సద్దుమణిగిపోయాయి.
విజయవాడ విషయానికి వస్తే.. కేసినేని నాని గట్టి పట్టే పట్టినట్లు తేలింది. కమిషనర్‌కు క్షమాపణ చెప్పడంతో ముగిసిపోయిందనుకున్న వివాదంపై ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్లే కనిపించింది. కృష్ణా జిల్లాలో తాజా ప్రమాదం అనంతరం ఆయన అరుణాచల్ ప్రదేశ్ కమిషనర్‌కు వివరాలతో మెయిల్ పెట్టారు. కేసినేనికి అందిన మెయిల్లో ఆ బస్సును అరుణాచల్‌లో పర్మిట్ రద్దుచేసినట్లు తేలింది. ఇలా మొత్తం 2400 బస్సులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడైంది. వీటిలో 900 బస్సులు తెలుగు రాష్ట్రాలలోనే తిరుగుతున్నాయట. ముందే మేలుకున్న తెలంగాణ రాష్ట్రం ఆయా బస్సుల వినియోగాన్ని నిషేధించింది. ఏపీలో ఆ పని జరగలేదు. సరిగ్గా ఇదే అంశాన్ని కేసినేని ఇప్పుడు వాడుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ విభాగంలో అవినీతికి ఇది ప్రబలమైన సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. అవకతవకలకు ఆలవాలమైన రవాణా విభాగంపై కేసినేని గురి చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో నిజాయితీ గల కార్యకర్తగా ఈ పరిస్థితికి తాను సిగ్గుపడుతున్నానంటూ ఆయన వ్యాఖ్య ఎవరికి సూటిగా తగులుతుందో వేరే చెప్పనక్కరలేదు. కేసినేని ట్రావెల్స్ మూసివేతకు దారితీసిన కారణంతోనే రవాణా శాఖ కమిషనర్‌ను ఇరుకున పెట్టాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తూనే ఉంది.
ఒక సారి చాకచక్యంగా పార్టీనీ, ప్రభుత్వాన్ని బయటపడేసిన చంద్రబాబు తాజా పాచికను ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి