టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డిని పేదల పక్షపాతిగా చెప్పుకొచ్చారు. చంద్రబాబును మోసగాడన్నారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాు. సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యం అనుకున్నానన్నారు. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలా మందే చెప్పారని.. పట్టించుకోకుండా, పార్టీలోనే కొనసాగానని కేశినేని నాని తెలిపారు. ఇన్ని రోజులు టీడీపీ కోసం, ప్రజల కోసం ఎంతో చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. పార్టీ ఖర్చులు తానే భరించినా, అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా ఆమోదం పొందిన తరువాత వైసీపీలో చేరతానని టీడీపీలో ఇంక అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని అవమనాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో నన్ను కొడతారని ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సైతం పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్రతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని తన భుజాలపై మోశానని కేశినేని చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్ర చేస్తూంటే కనీసం ముఖం కూడా చూపించలేదనేది బహిరంగరహస్యం అయినా తానేదో చేసినట్లుగా చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాుబ ఏమీ చేయలేదని ఆరోపించారు. గుంటూరు, విజయవాడ అభివృద్ది చేస్తే కంపెనీలు వస్తాయని చెబితే.. నీకు ఏం తెలియదంటూ తన నిర్ణయాలకు విలువ ఇవ్వలేదని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం మేర టీడీపీ ఖాళీ అయిపోతుందన్నారు.
త్వరలోనే నేతలు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ ని కలిసి కొన్ని విషయాలు చర్చించానని, ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని స్పష్టం చేశారు. కొసమెరుపేమిటంటే కుటుంబసభ్యులతో కొట్టించాలని చంద్రబాబ ప్లాన్ చేశారని కూడా కేశినేని చెప్పారు. కూతురు పెళ్లికి కూడా తమ్ముడ్ని ఆహ్వానించలేదు నాని. అలాంటి చంద్రబాబు కుటుంబ సమేతంగా వెళ్లారు. అయినా చంద్రబాబుపై వైసీపీ మార్క్ తిట్లు ప్రయోగించారు. అయినా నాని గురించి తెలిసిన వాళ్లు.. ఆయన వైసీపీని ఇదే రేంజ్ లో తిట్టడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంటున్నారు.