విజయవాడ ఎంపి కేశినేని నాని రాజకీయ ప్రవేశం తర్వాత మొదటి నుంచి కొంత స్వతంత్రంగానూ మరికొంత దూకుడుగానూ వ్యవహరిస్తూ వస్తున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరిక, బయిటకు వచ్చి టిడిపిలో చేరడం, ఎంపిగా గెలవడం మాత్రమే గాక వందలాది బస్సులున్న కేశినేని ట్రావెల్స్ అధినేతగానూ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. విజయవాడలో చాలా మంది టిడిపి నాయకులు ఆయన చుట్టూ చేరి పోయారు. అయితే కాల్ సెంటర్ వ్యవహారం తీగ లాగడంతో చాలా మందికి నాని ఒక కొరకరాని కొయ్యగా మారారు. ఆ మధ్య ఆర్టీఎపై దాడిపై బయిటివారి విమర్శలు సహజమే అయినా పార్టీలో ఈ అంతర్గత వ్యతిరేకులకూ అది పెద్ద ఆయుధంగా మారింది.ఇంతలోనే మంత్రివర్గ విస్తరణ, నానికి ఇటీవల దగ్గరగా వుంటున్న బోండా ఉమామహేశ్వరరావు అసమ్మతి వ్యాఖ్యలు చేస్తే వెళ్లి సర్దిచెప్పడం నానిని మళ్లీ ముందుకు తెచ్చాయి. ఈ స్తితిలో తనకు తానుగా కేశినేని ట్రావెల్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీఎ ప్రహసనం మొత్తం తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికేనని విమర్శలు వచ్చాయి గనక అసలు ట్రావెల్స్నే ఎత్తివేస్తానని ప్రకటించారు. అనడంతో ఆగక అంతపనీ చేసి చాలామందిని ఆశ్చర్యపర్చారు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులు ఇక్కడ తిరగడం సరికాదనే అంశంపై ఆయన విమర్శ చేస్తున్నా వాస్తవంలో గత కొంతకాలంగా నానికి ట్రావెల్స్ వ్యాపారంపై ఆసక్తి తగ్గుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. స్లీపర్బస్లుసు బయిట రిజిస్టర్ చేసుకుని ఇక్కడ తిరుగుతుంటే గతం నుంచి వున్న కేశినేని వంటివి నష్టపోతున్నాయట. ఇక దీనికి మంగళం పాడటమే మంచిదని నిర్ణయానికి వచ్చి ఆఖరి అస్త్రంగా ఆందోళనకు దిగితే అది అపశ్రుతిగా మారింది. ఈ దశలో బస్సులు నిలిపివేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు. అయితే ఎపి బయిట కేశినేని బస్సులు ఇరుగుతూనే వుంటాయని సమాచారం.
నాని రాజకీయ అవినీతికి పాల్పడే వ్యక్తి కాదని ముక్కు సూటిగా వ్యవహరించడం ఆయన నైజమని సన్నిహితులు చెబుతున్నారు. మొన్నటి ఉదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను పెద్ద మందలించేందేమీ లేదట. కాకుంటే సూటిగా వుంటారు గనక రాజకీయాల్లో అది అచ్చిరాదని చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోచెప్పలేమని కొందరు హెచ్చరిస్తున్నారు కూడా. అందుకు తగినట్టే నానికి వచ్చేసారి టికెట్ ఇవ్వబోరని ఏకంగా నారా బ్రాహ్మణి లేదా మరో నారా నందమూరి కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని కథలు వదులుతున్నారు. ఇదంతా చూసే నానిపై ఒక దుమారం సాగుతున్నట్టే చెప్పాలి.