కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ డిసెంబర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి .. హైపర్ లోకల్ ఆప్షన్ ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అంటే ఇక మోదీని హైలెట్ చేయకుండా ఆయా రాష్ట్రాల నాయకులకే బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాల వారీగా నాయకత్వాలను మార్చే అంశంపైనా దృష్టిపెట్టినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ కీలక నేతల్ని కలుస్తున్నారు. తెలంగాణ బీజేపీలో అంతర్గత వ్యవహారాలు కాక రేపుతున్నాయి. ఎవరూ బయటపడటం లేదు కానీ ముందు ముందు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకపక్ష దూకుడుతో ఇతర సీనియర్లు అందరూ అసంతృప్తిగా నే ఉన్నారు. ఆయన వల్ల పార్టీకి మేలు జరగడం లేదని.. నష్టం జరుగుతోందని అంటున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా వ్యాఖ్యలు చేయడం వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయంటున్నారు.
అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక..బీజేపీ పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా, మోదీ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఇప్పటి వరకూ ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. కానీ చేరికలు అసలు లేకపోవడం.. పార్టీ బలపడుతున్న సూచనలు లేకపోవడంతో .. వారిలోనూ ఆలోచన మొదలైందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలవాలంటే.. నాయకత్వాన్ని మార్చక తప్పదంటున్నారు. ఈటల రాజేందర్ టీ బీజేపీ అధ్యక్ష పదవికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.