తుంగభద్ర డ్యామ్ లోని 19వ గేటు కొట్టుకపోవటంతో భారీగా నీరు కిందకు వెళ్తుంది. ఎగువ నుండి వరద తగ్గటంతో డ్యాంలోని నీరు వృధాగా కిందకు పోతుంది. కింద ఉన్న ప్రాజెక్టులు కూడా ఇప్పటికే నిండి ఉండటంతో నీరంతా సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది.
అయితే, తుంగభద్ర డ్యాం నుండి 60 టీఎంసీల నీరు ఖాళీ చేస్తే తప్పా కొత్త గేటు ఏర్పాటు చేయలేని స్థితి ఉందని అధికారులు మొదట అంచనాకు వచ్చారు. కానీ అలా ఖాళీ చేస్తే రెండో పంటకు రైతులకు నీరు ఉండదు. తాగు నీటికి కూడా సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో కర్నాటక, ఏపీ అధికారులు రెండ్రోజులుగా నిపుణులతో చర్చించారు.
కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డ్యాంను పరిశీలించగా…. ఏపీ మంత్రులు పయ్యావుల, నిమ్మల రామానాయుడులు డ్యాం వద్దే అధికారులతో ఉన్నారు. అందరూ కలిసి చివరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాత్కాలికంగా ఓ గేటును ఏర్పాటు చేయబోతున్నారు. నీటి ప్రవాహం కొనసాగుతుండగానే… ఆ ప్రవాహంపై నుండి గేటును బిగించాలని, నీరును వాడుకున్నాక సాప్ట్ లాక్ పద్ధతిలో కొత్త గేటు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. తాత్కాలిక గేటు మరమ్మత్తుల కోసం జిందాల్ తో పాటు మరో రెండు కంపెనీలకు అప్పగించారు. నిపుణుల పర్యవేక్షణలో… అత్యంత సాహసోపేతమైన పనిచేయబోతున్నట్లు అధికారులంటున్నారు.