KGF Chapter2 Review
రేటింగ్: 2.75/5
భారతీయ భాషల మధ్య హద్దుల్ని చెరిపేసిన సినిమాల్లో `కేజీఎఫ్` ఒకటి. కన్నడలో రూపొందిన ఆ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. దేశం మొత్తం చూసింది. అందుకే ఆ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన `కేజీఎఫ్ ఛాప్టర్2` కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. టీజర్లు, ట్రైలర్లు ఆ అంచనాల్ని మరింతగా పెంచాయి. మరి సినిమా ఆ అంచాలకి దీటుగానే ఉందా?
చెప్పుకోదగ్గ కథేమీ లేదు. తొలి భాగం ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే రెండో భాగం మొదలవుతుంది. రాఖీభాయ్ (యశ్) శత్రువులెవరో తొలి భాగంలోనే తెలుస్తుంది. బంగారు గనుల సామ్రాజ్యం నరాచీని తన గుప్పెట్లోకి తీసుకున్న రాఖీభాయ్ ఆ తర్వాత తన శత్రవుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈసారి రాజకీయం పరంగా ప్రధాని రమికా సేన్ (రవీనాటాండన్) నుంచి వైరం ఏర్పడుతుంది. చనిపోయాడనుకున్న అధీరా (సంజయ్‌దత్) మళ్లీ తిరిగొచ్చి నరాచీ కోసం రంగంలోకి దిగుతాడు. మరి ఇన్ని సవాళ్లని రాఖీభాయ్ ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా.
హీరోయిజానికి… ఎలివేషన్స్కీ కొత్త అర్థం చెప్పిన చిత్రం `కేజీఎఫ్ ఛాప్టర్ 1`. అందులో ఓ సామాన్యమైన ఓ కుర్రాడు రాఖీభాయ్ అనే ఓ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే తీరు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. కేజీఎఫ్ సామ్రాజ్యంతోపాటు, హీరోయిజంతోనూ ప్రేమలోపడ్డారు ప్రేక్షకులు. అందుకే రెండో భాగం కోసం అంతగా ఆసక్తి వ్యక్తమైంది. హీరోయిజం ఎలివేషన్స్తోపాటు, సినిమా స్థాయి, విజువల్స్, సంగీతం పరంగా తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది. కానీ కథనం పరంగా మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించదు. తొలి భాగంలో హీరో ఎదుగుదల ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక్కడ మాత్రం హీరో పాత్రలో ఆ గ్రాఫ్ కనిపించదు. అప్పటికే ఎదిగిన హీరో శత్రువుల్ని ఢీకొనడమే పనవుతుంది. ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు పెద్దగా కిక్‌నివ్వవు. ఎంత గ్రాండ్‌నెస్ ఉన్నా, ఎంత హీరోయిజం ఉన్నా వాటికి కథ, కథనాల పరంగా తగిన బలం కూడా తోడవ్వాలి. ఈ సినిమాకి ఆ బలమే లోపించింది. కొండల్ని పిండిచేయగల అధీరా (సంజయ్‌దత్)తోపాటు, ఇందిరాగాంధీని గుర్తు చేసేలా ప్రధాని రమికాసేన్ (రవీనాటాండన్) పాత్రని ఈ కథలోకి జోడించినా ఆ ప్రయత్నం కథ పరంగా బలాన్నివ్వకపోగా, హీరోయిజం కోసమే వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. హీరో, రమికాసేన్ నేపథ్యంలో సన్నివేశాలు మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి ఓ గ్యాంగ్‌స్టర్ నేరుగా ప్రధానికి వార్నింగ్ ఇస్తాడు. అది చాలదన్నట్టుగా పార్లమెంట్‌లోకి తన సైన్యాన్ని తీసుకెళ్లి ప్రధాని ముందే ఓ ఎంపీని కాల్చేస్తాడు. ఇలా ప్రతీ సన్నివేశం హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసమే అన్నట్టుగా ఉంటుంది. అయితే సినిమా స్కేల్, హీరో పాత్రని ఆవిష్కరించిన తీరు మరోసారి ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. కేజీఎఫ్ అభిమానుల్ని మరింతగా సంతృప్తి పరుస్తుంది. అధీరా దెబ్బ కొట్టాక తిరిగొచ్చిన హీరో మళ్లీ అతన్ని తన సైన్యంతో కలిసి ఢీ కొట్టే తీరు, చిన్న బంగారం బిస్కెట్‌ని తీసుకెళ్లిపోయారని పోలీస్ స్టేషన్ ముందు సృష్టించే బీభత్సం, హీరోయిన్ కోసం శత్రువుల్ని వెంటాడి తనతో తీసుకొచ్చే వైనం… ఈ సన్నివేశాలు సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.
నటన పరంగా యశ్ మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఘట్టాల్లో, హీరోయిజం ప్రదర్శించడంలోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించాడు. సంజయ్‌దత్ … అధీరాగా కనిపించిన తీరు బాగుంది కానీ, ఆయన పాత్ర సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. రవీనా టాండన్ శక్తివంతమైన పాత్రలో కనిపించింది. కథానాయిక శ్రీనిధి శెట్టి ఇందులో కీలకమైన సన్నివేశాల్లో సందడి చేసింది. రావు రమేష్, ప్రకాష్‌రాజ్, ఈశ్వరీరావు తదితరులూ ఆకట్టుకుంటారు.
సాంకేతికంగా ఈ సినిమా ఓ మాయాజాలం. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఆ విషయంలో కెమెరా విభాగం పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సంగీతం అక్కడక్కడా లౌడ్‌గా అనిపించినా హీరోయిజాన్ని ఆవిష్కరించడంలో కీలకంగా పనిచేసింది. దర్శకుడు కేజీఎఫ్ ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడంపైనే దృష్టి పెట్టి అన్ని హంగుల్నీ జోడించారు. తన సీన్ కటింగ్ ఆశ్చర్యపరుస్తుంది. రెండు మూడు వేర్వేరు సీన్లని… కట్ చేసి, ఎలివేషన్ల పరంగా వాడుకున్న విధానం మంత్ర ముగ్థుల్ని చేస్తుంది. ఇక డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ మాటా.. ఓ తూటాలా పేలింది. `ఇక్కడ తలలే మారతాయి.. కిరీటాలు కాదు` అనే మాట మకుటం లాంటిది. చదరంగం, వైకుంఠపాళీలను పోలుస్తూ రాసుకున్న డైలాగులు యాప్ట్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
`కేజీఎఫ్` అభిమానులకి, యశ్ అభిమానులకి ముందుగానే దీపావళి పండగ వచ్చిన అనుభూతిని పంచుతుందీ చిత్రం. సామాన్య ప్రేక్షకులకి మాత్రం అక్కడక్కడా గందరగోళంగా, టూ మచ్ హీరోయిజం సన్నివేశాలతో భారంగా అనిపించేలా ఉంటుందీ చిత్రం.
ఫినిషింగ్ టచ్: ఎలివేషన్ కా బాప్
రేటింగ్: 2.75/5