(- రావూరి)
కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అనే ఓ మధ్య తరగతి కుర్రాడు ప్రేక్షకుల గుండెల్లో ‘చిరంజీవి’గా నిలిచిపోయిన కథ ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ముప్ఫై ఏళ్ళ క్రితం ఓ కుర్రాడు సాధించిన విజయాన్ని మళ్ళీ ఇప్పటి వరకూ కూడా ఎవ్వరూ రిపీట్ చేయలేకపోయారు.హీరోలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిరంజీవిలా చరిత్ర సృష్టించిన వాళ్ళు లేరు. చిరంజీవి తెరపైకి వచ్చిన కాలంలో తెలుగు సినిమా యాక్టర్ల నటనలో కొంచెం డ్రమెటిక్, సినిమాటిక్ నటన కనిపిస్తూ ఉండేది. చిరంజీవి ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేశాడు. అందుకే తరువాత తరానికి ప్రతినిది అయ్యాడు. అభిమాన యువతకు ఆరాధ్య దైవం అయ్యాడు. అలాగే డ్యాన్సుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇండియాలోనే నంబర్ ఒన్ డ్యాన్సర్‌గా నిలిచాడన్నది వాస్తవం. ఆ టైంలో సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళెవ్వరూ కూడా డ్యాన్సులలో చిరంజీవికి పోటీ కాదు. ఈ విషయాన్ని రజినీకాంత్ స్వయంగా ఒప్పుకున్నాడు.
ఓ మధ్య తరగతి కుర్రాడు ఈ స్థాయి విజయాన్ని ఎలా సాధించగలిగాడు? కోట్లాది మంది గుండెల్లో స్థానం ఎలా సంపాదించగలిగాడు? ప్రపంచం మొత్తం చాలా అడ్వాన్స్ అయిందని చెప్పుకుంటున్న ఈ రోజు కూడా, ఓ మధ్య తరగతి కుర్రాడు సినిమా హీరో అవ్వాలని చేసే ప్రయత్నాలను సమాజం హర్షించదు. పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. మరి నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి తన పేరెంట్స్‌ని ఎలా ఒప్పించాడు? ఏ ధైర్యంతో చెన్నై వెళ్ళాడు? చాలా మంది వెళ్ళినంత స్పీడ్‌గా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి మాత్రం ఏ నమ్మకంతో నిలబడిపోయాడు? అన్నీ ప్రశ్నలే. లోతుగా ఆలోచిస్తే అంతా దైవేఛ్ఛ. అలా కలిసొచ్చింది లాంటి మాటలు మన నోటి నుంచి అలవోకగా వస్తూ ఉంటాయి. కానీ అది అబద్ధం.
ఆ విషయం చెప్పడానికి మనం నలభై ఏళ్ళు వెనక్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండేళ్ళు వెనక్కి వెళితే చాలు. రెండేళ్ళ క్రితమే మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 150వ సినిమా చేయాలనుకున్నాడు. రామ్ చరణ్ తేజ్ డబ్బులు పెట్టడానికి ముందుకొచ్చాడు. సొంత డబ్బులతో చిరంజీవి లాంటి స్టార్ హీరో ఓ సినిమా తీసుకోవాలి అని అనుకుంటే ఎంత సేపు? ఈ రెండేళ్ళలో నాలుగు సినిమాలైతే చాలా ఈజీగా చేసి ఉండేవాడు. అలా చేసి ఉంటే చిరంజీవి ఓ మామూలు హీరో అయ్యేవాడు. మెగాస్టార్ చిరంజీవి అయ్యేవాడు కాదు. తెలుగు సినిమా తెరపై మూడు దశాబ్ధాలపాటు నంబర్ ఒన్ హీరోగా నిలబడిపోయి ఉండేవాడు కాదు.
ఖైదీ సినిమా టైంలో చిరంజీవి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’వ సినిమా కోసం కూడా అన్నే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చిరంజీవి. మంచి కథను సెలక్ట్ చేసుకోవడం కోసమే సంవత్సర కాలం తీసుకున్నాడు. కమర్షియల్ హిట్ కావాలనుకుంటే చిరంజీవి 150వ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉండేది. కానీ చిరంజీవికి కేవలం హిట్ సినిమా అవసరం లేదు. ఏ ఒక్క వర్గానికో అవసరమయ్యే కథ కాదు…..
అన్ని వర్గాలకు నచ్చే కథ కావాలి. సినిమా చూసిన వాళ్ళందరికీ చిరంజీవి పైన గౌరవం కలగాలి. చిరంజీవిని వాళ్ళు ఓన్ చేసుకోవాలి. చిరంజీవిని తమ మనిషిగా వాళ్ళు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే ఆ కథ, క్యారెక్టరైజేషన్లో చాలా విషయం ఉండాలి. ఖైదీ సినిమా టైం నుంచి కూడా చిరంజీవి చేసింది అదే. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. లార్జర్ దేన్ లైఫ్ హీరోయిజంతో పాటు ప్రేక్షకులందరూ కూడా తనను ఓన్ చేసుకోవాలన్న ఆలోచనతో మామూలు కుర్రాడిగా తెరపైన కనిపించడానికి ప్రయత్నం చేశాడు. చాలా సాధారణంగా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే కుర్రాడు ఎంతటి అసాధ్యమైన పనిని సాధించాడు అనే కాన్సెప్ట్‌తోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ సినిమా కథ కూడా అదే.
కథను సెలక్ట్ చేసుకోవడం అయ్యాక చిరంజీవి మరో విషయంలో కూడా చాలా శ్రధ్ధ తీసుకుంటాడు. సినిమాలో తన కష్టం కనిపించాలనుకుంటాడు. డ్యాన్సులు, ఫైట్స్, నటన అన్ని విషయాల్లోనూ చాలా కష్టపడతాడు. చిరంజీవి తప్ప ఈ సినిమాను ఇంకెవ్వరూ చెయ్యలేరు అన్న పేరు తెచ్చుకోవడానికి తపిస్తాడు. ఇప్పుడు 150వ సినిమా కోసం కూడా అదే విధమైన తపస్సు చేస్తున్నాడు. ఎలా కనిపించాలి? ఎలా కనిపిస్తున్నాను? ఇంకా బెటర్‌గా రావాలంటే ఏం చేయాలి? సినిమా కోసం ఇంకా ఏం చేయాలి? లాంటి విషయాలను గురించి అనుక్షణం ఆలోచిస్తున్నాడు. సెట్స్‌లో యాక్ట్ చేశాం…. అయిపోయింది అనేలా కాకుండా సినిమా రిలీజ్ అయ్యేవరకూ కూడా ఆ సినిమా కోసం ఇంకా ఏం చెయ్యొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు మెగాస్టార్. దర్శకత్వం, కథ, సీన్స్, ఎమోషన్స్ గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు చిరంజీవి. అలాగే ఎప్పటికప్పుడు సినిమా మేకింగ్‌లో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ ఉంటాడు.
ఇవన్నీ కూడా చాలా మంది హీరోలు చెయ్యగలరు కానీ చిరంజీవిలా ప్రవర్తించడాన్ని మాత్రం ఈ తరం హీరోలెవ్వరూ నేర్చుకోలేరు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌లతో కలిసి నటించాడు చిరంజీవి. ఆ తర్వాత తరం హీరోలతో కూడా చాలా సినిమాలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో చాలా సార్లు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఏ రోజూ కూడా నోరు జారలేదు. గొడవను పెంచుకోలేదు. అజాత శతృవు అని అనిపించుకోవడానికి చిరంజీవి చాలా చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. తను మెగాస్టార్‌గా ఎదిగాక, మెగా ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వచ్చాక కూడా చిరంజీవిలో మార్పు ఏమీ లేదు. ఆ విషయం చెప్పడానికి బాలకృష్ణ సినిమా ప్రారంభోత్సవంలో చిరంజీవి మాట్లాడిన మాటలే సాక్ష్యం. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా మాటలతోనో, ప్రతి విమర్శతోనో సమాధానం చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు మెగాస్టార్. సినిమా హీరో కెరీర్‌కి సంబంధించినంత వరకూ ఈ నియమాన్ని ఎప్పుడూ దాటలేదు.
మెగాస్టార్ చిరంజీవిగా శివశంకర వరప్రసాద్ సృష్టించిన చరిత్ర…. విజయం సాధించాలనుకునేవాళ్ళకు ఓ గొ్ప్ప పాఠం అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఏం చేస్తే సక్సెస్ వస్తుందో తెలుసుకున్నాడు. ఎంత కష్టపడితే సక్సెస్ వస్తుందో తెలుసుకున్నాడు. ఆ విజయం శాశ్వితంగా నిలబడిపోవాలంటే నలుగురితో ఎలా ఉండాలో తెలుసుకున్నాడు చిరంజీవి. అందుకే తెలుగు తెరపై ‘చిరంజీవి’గా నిలబడిపోయాడు.