ఖమ్మం జిల్లా బీఆర్ ఎస్ ఇంటి పోరు నడుస్తూనే ఉంది. అప్పటికప్పుడు పరిష్కారాలే తప్పించి శాశ్వతంగా సమస్యని వదిలించుకునే ప్రయత్నం బీఆర్ ఎస్ అధినేత చేయలేదు. ఫలితంగా ఎన్నికల సమయం ముంచుకొస్తోన్న వేళ ఆ పార్టీ నుంచి సీనియర్లు జారుకునే పరిస్థితి కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సారి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే రానున్న ఎన్నికల్లో తాను.. తన అనుచరులంతా పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
ఓ వైపు సిట్టింగ్ లకే సీట్లని ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. అలాంటిది పొంగులేటి ఆయన అనుచరులు ఎలా ఎన్నికల బరిలో ఉంటారన్నది పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. బీజేపీ కూడా ఖమ్మం జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పలుమార్లు బీఆర్ ఎస్ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కూడా చేసిందన్న వార్తలు వచ్చాయి. మొదట్లో కాషాయం ఆఫర్ ని కాదన్న పొంగులేటి ఇప్పుడు ఓకే చెప్పినట్లు చెబుతున్నారు
తుమ్మల కూడా పార్టీ మారే ఛాన్స్ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. పాలేరు టిక్కెట్ ఆశిస్తోన్న తుమ్మలకి ఈసారి కూడా రాకపోవచ్చన్న టాక్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో తుమ్ముల వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. గోదావరి వరదల సమయంలో బాధితుల పరామర్శకి వచ్చిన కెసిఆర్ జిల్లా రాజకీయాలపై తుమ్మలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఆయన కూడా బీజేపీలో చేరుతారని అంటున్నారు., వారిద్దరూ బీజేపీలో చేరితే… ఆ పార్టీకి ఖమ్మంలో నాయకత్వ సమస్య తీరినట్లే.