ఈమధ్య రీమేకులు అస్సలొద్దు అని హీరోలు చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోతున్నారు. రీమేకులకు మేకులై నిర్మాతల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ హిందీ సినిమా రైట్స్ కోసం తెలుగు, తమిళం నుంచి నిర్మాతలు ఎగబడుతున్నారు. ఆ సినిమానే ‘కిల్’.
ఈమధ్య కాలంలో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ‘కిల్’ ని ది బెస్ట్ అని చెప్పొచ్చు. రూ.20 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ.50 కోట్లు రాబట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని మిగిలిన భాషల్లో రీమేక్ చేయడానికి గట్టి పోటీ మొదలైంది. ముఖ్యంగా తెలుగు నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ రేసులో ఉన్నాయి. మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న కె.ఎల్.నారాయణ ‘కిల్’ రీమేక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరో నిర్మాత కోనేరు సత్యనారాయణ కూడా ఈ రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి రీమేక్ రైట్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే `కిల్` ఇంగ్లీష్ రైట్స్ ని నిర్మాత కరణ్ జోహార్ మంచి రేటుకి అమ్మేసినట్టు తెలుస్తోంది. తెలుగులో మాస్ ఇమేజ్ ఉన్న టైర్ 2 హీరోలంతా ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఓ నిర్మాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి, ఒకే హీరోతో పునః నిర్మించడానికి రంగం సిద్ధం చేసేశాడట. హీరో చేతిలో అడ్వాన్స్ కూడా పెట్టేశాడట. అయితే రీమేక్ రైట్సే ఇంకా ఆయన చేతికి రాలేదు. రీమేక్ రైట్స్ ఆయన దక్కించుకోకపోతే.. ఆ హీరో కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎంత రేటయినా ‘కిల్’ హక్కులు దక్కించుకోవాలన్న నిశ్చయంతో ఉన్నాడాయన. ఈమధ్య కాలంలో ఓ రీమేక్ కథ కోసం ఇంత పెద్ద పోటీ చూడలేదు. చివరికి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో?