బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో తన అరంగేట్రం ఘనంగా చాటాడు కిరణ్ అబ్బవరం. ఆ తరవాత ట్రాక్ తప్పాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి భంగపడ్డాడు. ఇప్పుడు ఓ డీసెంట్ హిట్ కొట్టడం అత్యవసరం. హిట్టు కొట్టాల్సిన అవశ్యకతను కిరణ్ అబ్బవరం కూడా గ్రహించాడు. అందుకే తన తదుపరి సినిమా ‘క’ పై ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టాడు. ఈ సినిమాకు ప్రొడక్షన్ పనులు కూడా దగ్గరుండి చూసుకొన్నాడు. తన రెమ్యునరేషన్ తగ్గించుకొని, క్వాలిటీ కోసం పరితపరించాడు. ఆ కష్టం ఫలించింది. ‘క’ టీజర్ ఇటీవలే బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఏదో విషయం ఉందన్న సంగతి మార్కెట్ కు అర్థమైంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా మంచి రేటు పలుకుతోంది. ఆంధ్రా, నైజాం, సీడెడ్.. ఇలా అన్ని ఏరియాల్లోంచి మంచి రేటుకే ఈ సినిమా అమ్ముడుపోయిందని సమాచారం.
థియేట్రికల్ రైట్స్ రూపంలో కనీసం రూ.13 కోట్లయినా వస్తాయి. నాన్ థియేట్రికల్ నుంచి మరో 8 కోట్లు వచ్చే ఛాన్సుంది. అంటే రూ.20 కోట్ల పైచిలుకు బిజినెస్ జరగబోతోందన్నమాట. సినిమా బడ్జెట్ దాదాపు రూ.18 కోట్ల వరకూ అయ్యింది. అంటే… విడుదలకు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో బయటపడబోతోంది. నిజానికి ఈ సినిమాని రూ.12 నుంచి 14 కోట్లలో ముగించాలనుకొన్నారు. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం వల్ల ఖర్చు పెరిగింది. దాంతో లాభాలు తగ్గాయి.
ఓ పోస్ట్ మాన్ కథ ఇది. థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్తో పాటు సూపర్ నేచురల్ లాంటి అంశాలు ఈ కథలో మేళవించారని తెలుస్తోంది. ఈ సినిమాతో సుజిత్, సందీప్ అనే దర్శకులు పరిచయం అవుతున్నారు. కథలో ఏకంగా 8 ట్విస్టులు ఉంటాయని, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లలో వచ్చే ట్విస్ట్ ఊహకు కూడా అందదని చిత్రబృందం చెబుతోంది. సెప్టెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కిరణ్ హీరోగా నటించిన ‘దిల్ రూబా’ కూడా విడుదలకు రెడీగా ఉంది. నిజానికి ‘క’ కంటే ముందే ‘దిల్ రూబా’ విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. కిరణ్ ప్లాన్ మారింది. ముందు ‘క’నే రిలీజ్కు రెడీ చేస్తున్నారు. ఆ తరవాతే ‘దిల్ రూబా’ వస్తుంది.