మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హఠాత్తుగా ఆయనను సోము వీర్రాజు హైదరాబాద్ ఇంట్లో కలిసి మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విస్తృత ప్రచారం చేస్తున్నామని.. తమకు కూడా రావాలని ఆహ్వానించారు. అయితే కిరణ్ రెడ్డి మాత్రం హైకమాండ్ ఎలాంటి బాధ్యతలిచ్చినా చేస్తానని రొటీన్ డైలాగ్ చెప్పి పంపేశారు. ఆయన ఉద్దేశం.. హైకమాండ్ తనకు అర్జంట్ గా ఏదో ఓ పదవి ప్రకటించడం. కానీ కిరణ్ గురించి పట్టించుకునే తీరికలో ప్రస్తుతం హైకమాండ్ లేదు.
ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సొంత పార్టీపెట్టుకుని కొన్నాళ్ల తర్తా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరినా ఆయన ఏ పనీ చేయలేదు. ఏ పదవీ తీసుకోలేదు. ఆయన అంగీకరించి ఉంటే ఏపీ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి ఉండేవాళ్లు. కానీ ఆయన తీసుకోలేదు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అలా చేరిన తర్వాత ఆయన బయట కనిపించలేదు. వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లిపోయారు. ఆయన పార్టీలో చేరినప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆయన పాత్ర దగ్గర్నుంచి చాలా ప్రచారాలు జరిగాయి. కానీ జరిగింది మాత్రం శూన్యం.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో దక్షిణాదిన బీజేపీ పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ నిర్ణయాల విషయంలో తననే కామెడీ చేసుకుంటున్నారేమో తెలియదు కానీ.. ఏపీలో జనంలోకి వెళ్లేందుకు మాత్రం ఆయన వెనుకడుగు వేస్తున్నారు. బీజేపీ తరపున ప్రచారానికి కూడా సిద్ధపడటం లేదు. పైగా ఏపీ బీజేపీలో ఉన్న వర్గాల కారణంగా ఆయనను కలుపుకునిపోవడం కూడా డౌటే. హైకమాండ్ సూచనల మేరకు సోము వీర్రాజు కలిసి ఉంటారని.. వాస్తవంగా అయితే ఆయన కూడా పట్టించుకోరని అంటున్నారు.