మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్లీ రాజీనామా చేస్తున్నా అన్న లేఖ రాయడమే తప్ప… కాంగ్రెస్ కోసం ఫలానా పని చేశారన్న వార్త రాలేదు. ఎందుకంటే ఆయన ఏ పనీ చేయలేదు. కాంగ్రెస్ నేత అనే ట్యాగ్ ను మాత్రం మోశారు. ఎలాంటి బాధ్యతలు చేపట్టడానికి అంగీకరించలేదు. ఆయనకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నించింది. కానీ తీసుకోలేదు.
ఇప్పుడు ఆయనను బీజేపీ పిలిచి మరీ చేర్చుకుంటోంది. రాజకీయాలకు దూరం అయిపోయి చాలా కాలం అయింది. ఆయనకంటూ క్యాడర్ లేదు. ఆయన క్యాడర్ ఏమైనా ఉంటే ఆయన సోదరుడి వెంట టీడీపీలోకి వెళ్లిపోయింది. ఆయన బీజేపీలో చేరినా ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా అదనంగా రాదు. మరి బీజేపీ కిరణ్ రెడ్డి నుంచి ఏం ఆశిస్తోంది. ఆయనను పార్టీలో పిలిచి మరీ చేర్చుకుంటున్నందున ఓ పదవి ఇవ్వక తప్పదు. అది జాతీయస్థాయి పదవి ఇవ్వాలి. ఇంత చేసినా కిరణ్ రెడ్డి ఏపీ బీజేపీ బాధ్యతలు తీసుకుంటారా… అంటే చెప్పడం కష్టమే.
బీజేపీ ఏ వ్యూహంతో కిరణ్ రెడ్డిని తీసుకుంటుందో కానీ అది బీజేపీకి భారమే కానీ లాభం కాదని.. ఎక్కువ మంది నమ్ముతున్నారు. అసలే ఏపీ బీజేపీలో ఓటర్లు లేకపోయినా ఉన్న నేతలే రెండు, మూడు వర్గాలుగా విడిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా కిరణ్ రెడ్డిని ఇంక్లూడ్ చేసి… మరింత గందరగోళం చేసుకోవడం తప్ప.. ఏ ప్రయోజనం ఉండదని ఆ పార్టీవర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.