హైదరాబాద్ నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కనీసం పది శాతం హైదరాబాద్‌లో ఖర్చు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్‌కు విజ్ఞప్తి లాంటి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న ఆయన.. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో తన నియోజకవర్గంలో వారాంతాల్లో అయినా పాదయాత్రలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా తెరపైకి అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే ఎంపీగా ఆయన పరిధిలో లేనివే ఎక్కువ కావడంతో.. సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకే ఆదాయంలో ఖర్చు గురించి వాదన తీసుకొస్తున్నారు.
రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సమస్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు మొత్తం రెవెన్యూలో 80 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీలో పనులు పెండింగ్ పడుతున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ధర్నాలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిది ఒక్కటే ఒక 10 శాతం ఆదాయాన్ని అయినా స్థానికంగా ఖర్చుపెట్టాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు కల్పతరువు హైదరాబాదే. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంతోనే తెలంగాణ సర్కార్ నడుస్తోంది. ఇతర జిల్లాల్లో వరంగల్, కరీంనగర్ వంటివి అభివృద్ధి చెందుతున్నా.. వాటి నుంచి రాష్ట్రానికి పెద్ద ఆదాయం రావడం లేదు. హైదరాబాద్… మెట్రో సిటీ కావడంతో ఆదాయం అన్ని విధాలుగా లభిస్తోంది. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం సౌకర్యాలు లేవని. కనీసం పది శాతం ఆదాయం ఇక్కడే ఖర్చు పెట్టాలన్న వాదనను కిషన్ రెడ్డి తీసుకొచ్చారు.
హైదరాబాద్ ఆదాయం హైదరాబాద్‌కే ఖర్చు పెట్టాలన్న డిమాండ్ వస్తే.. అదో సెంటిమెంట్ అయ్యే అవకాశం ఉంది. సిటీలో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నా.. అంతర్గతంగా మాత్రం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని బీజేపీ దూకుడుగా ముందుకు తీసుకెళ్తే గ్రేటర్లో సెంటిమెంట్ పడించే చాన్ ఉందని అనుకోవచ్చు.