తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం దళిత బంధు. ఆ క్రెడిట్ సంపూర్ణంగా ఆయనదే. హుజురాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టేందుకు అక్కడి దళిత వర్గాలందర్నీ ఆకట్టుకునేందుకు కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారని భావిస్తూంటారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అదే అనుకుంటున్నారు. అంతే కాదు.. అసలు ఆ పథకానికి ఈటల రాజేందర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఈటల వల్లే ఆ పథకం పురుడు పోసుకుందని అందుకే ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈటల రాజేందర్ కోసం ఆయన ప్రస్తుతం హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం గురించి ప్రస్తావించి అది ఈటల వల్లనే వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈటలకు కౌంటర్ ఇవ్వడానికి .. తెలంగాణలోని దళిత వర్గాలన్నింటినీ ఏకపక్షంగా మద్దతుదారులుగా మల్చుకోవడానికి కేసీఆర్ దళిత బంధుకు రూపకల్పన చేశారని చెబుతున్నారు కానీ.. ఇప్పటి వరకూ దానికి ఈటల పేరు పెట్టాలనే ఆలోచన కానీ.. డిమాండ్ కానీ రాలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆ డిమాండ్ తీసుకొచ్చారు.
పొరుగు రాష్ట్రంలో ఏ చిన్న పని చేసినా.. చివరికి శుభ్రత కార్యక్రమాలు చేపట్టిన జగనన్న పేరు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పథకాలను పథకాలుగానే ఉంటుతున్నారు, కేసీఆర్, కేటీఆర్ పేర్లు పెట్టుకోడం లేదు. కొత్తగా పథకానికి ఈటల పేరును పెట్టాలన్న డిమాండ్‌తో పథకాలకు పేర్ల అంశం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.