తెలంగాణలో జనసేనతో పొత్తుల కోసమో మద్దతు కోసమో ఆరాటపడుతున్న బీజేపీ పవన్ కల్యాణ్‌తో చర్చలకు సిద్ధమయింది. ఇప్పటికే ఓ సారి పవన్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చించారు. ఉత్తినే మద్దతివ్వాలని పోటీ చేయవద్దని కోరారు. కానీ తమ క్యాడర్ అస్సలు ఒప్పుకోదని కనీసం ముఫ్ఫై సీట్లలో పోట చేస్తామని పవన్ కల్యాణ్ తేల్చేశారు. పవన్ అభిప్రాయాలను తెలుసుకుని ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి .. మొదటి జాబితా ప్రకటన తర్వాత హైదరాబాద్ వచ్చి..జనసేనతో పొత్తుల చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు.
కానీ హఠాత్తుగా ప్రత్యేక విమానాన్ని మాట్లాడి.. పవన్ ను తోడుగా తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అమిత్ షా తో పాటు జేపీ నడ్డా వంటి వారిని కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో కొంత మంది బీజేపీ సానుభూతిపరులు తెలంగాణలో జనసేన పార్టీకి పన్నెండు సీట్లు ఇస్తారని ప్రచారం ప్రారంభించారు. ఆ లిస్టు కూడా పోస్టు చేశారు. కానీ జనసేనకు మాత్రం సమాచారం లేదు. ఈ క్రమంలో పవన్ ను తీసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో జనసేన పోటీ చేసే స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే బీజేపీకి జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని.. కేవలం జనసేనను పోటీ నుంచి తప్పించి.. తమకు మద్దతుగా ఉండేలా చేసకోవాలన్న ఉద్దేశం మాత్రమే ఉందని బీజేపీలోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. పవన్ పోటీ చేయడం వల్ల సెటిలర్ల ఓట్లు చీలిపోతాయి తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పోటీ చేయవద్దని మోటివేట్ చేస్తారని అంటున్నారు. అమిత్ షా చెబితే పవన్ కల్యాణ్ ఖచ్చితంగా వింటారని అందుకే ఆయనను ప్రణాళిక ప్రకారం ఢిల్లీకి తీసుకెళ్లారన్న వాదన వినిపిస్తోంది.