కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ .. తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన… కొద్ది రోజుల క్రితం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో అనుచరులతో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో పని చేయడం తనకు కొత్త కాదని… ఎన్టీఆర్ హయాంలోనే పదేళ్ల పాటు ఆయనతో కలిసి పని చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన.. అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ఇంత వరకూ.. అరకు పార్లమెంట్‌కి పోటీ చేసి గట్టి అభ్యర్థి లేక… టీడీపీ ఇబ్బంది పడింది. ఆ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీ చేసి.. గెలిచారు. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
2011 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అనుచరగణం ఉన్న కిషోర్ చంద్రదేవ్… గట్టి అభ్యర్థి అవుతారని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇప్పటి వరకూ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అరకు నేతలు.. పలువురు కిశోర్‌చంద్ర దేవ్ తో కలిసి టీడీపీలో చేరారు. కొత్తూరు మాజీ ఎమ్మెల్యే మినతీ గొమాంగో , పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా 100 మంది వరకు టీడీపీలో చేరారు. గిరిజనులకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందని.. చంద్రబాబు ప్రకటించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది వైఎస్ అయితే.. రద్దు చేసింది తానని గుర్తు చేశారు.
చేరిక కార్యక్రమంలో చంద్రబాబు.. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయపెట్టి… ఏపీపై… కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మోడీవి మాటలేనని.. చేతలు లేవనన్నారు. మోడీ, కేసీఆర్, జగన్ కలిసిపోయి.. కుట్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు. జగన్ ఆటలు ఏపీలో సాగవని.. తేల్చిచెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరు అడ్డుకున్నా.. ఏపీని అభివృద్ధి చేసి తీరుతామన్నారు.