తొలి ఫ్లే ఆఫ్ లో హైదరాబాద్ నిరాశ పరిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్…. ఇలా అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన కొలకొత్తా హైదరాబాద్ ని ఓడించి, దర్జాగా ఫైనల్ లో ప్రవేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సర్ రైజర్స్ 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఓవర్ నుంచి ఓ దశలోనూ… సర్‌రైజర్స్ బ్యాటర్స్ క్రీజులో నిలవలేకపోయారు. కొలకొత్తా క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో… భారీ బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన హైదరాబాద్ 159 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. సన్ రైజర్స్ జట్టులో రాహుల్ త్రిపాఠి (55), క్లాసన్ (32) మాత్రమే రాణించారు. చివర్లో కమిన్స్ (30) బ్యాట్ ఝులిపించడంతో సన్‌రైజర్స్ 159 పరుగులైనా చేయగలిగింది. కొలకొత్తాలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో విజృంభించాడు. వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి.
అనంతరం 160 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేపట్టిన కొలకొత్తా తొలి ఓవర్ నుంచి విజృంభించి ఆడింది. కేవలం 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. గుర్బాజ్ (23), నరేన్ (21), వెంకటేష్ అయ్యర్ (51 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్) రాణించారు. ఫైనల్ చేరడానికి హైదరాబాద్ కు ఇంకా ఛాన్సుంది. రేపు బెంగళూరు, రాజస్థాన్ మధ్య రెండో ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది. అందులో గెలిచిన జట్టుతో హైదరాబాద్ ఓ మ్యాచ్ ఆడాలి. ఆ మ్యాచ్‌లో ప్రతాపం చూపిస్తే… హైదరాబాద్ ఫైనల్ లో అడుగు పెడుతుంది.