మాజీ మంత్రి కొడాలి నాని కిడ్నీలో రాళ్ల సమస్య తీవ్రం కావడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత కిడ్నీలకు లేజర్ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొడాలి నాని ఆస్పత్రిలో చేరి రెండు, మూడు రోజులు అవుతున్నట్లుగా తెలుస్తోంది. విషయం బయటకు రాలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొడాలి నానికి ఉన్న కొన్ని వ్యక్తిగత అలవాట్ల వల్ల కిడ్నీ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తోంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా మంది సహజమే కానీ.. అలాంటి సమస్య వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత అలవాట్లు మానుకోవడం.. గుట్కా, మాంసాహారానకి దూరంగా ఉండటంతో పాటు క్రమబద్దమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే కిడ్నీలో రాళ్లు మళ్లీ పెరగడమే కాదు ప్రాణాంతకం అవుతాయి. రాజకీయాల్లో బీజీగా ఉండే కొడాలి నాని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్య తీవ్రం అయినట్లుగా భావిస్తున్నారు.
హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మొత్తం గోప్యత పాటిస్తున్నారు. అయితే సమస్య చిన్నదేనని.. నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్దదయిందని.. ఆందోళన చెందాల్సిందేమీ లేదని కొడాలి నాని సన్నిహితులుచెబుతున్నారు. కొద్ది రోజుల కిందట.. ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ కూడా హఠాత్తుగా గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చాలా కాలం విశ్రాంతి తీసుకుని ఇటీవేల రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.