ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లతో ప్రమాణం చేయించాలని ప్రభుత్వం డిసైడయింది. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో గతంలో గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లయ్యాయి. ఈ కారణంగా వారితో ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయి రెండేళ్లు అవుతోంది. రోజులు గడిచే కొద్దీ పదవి కాలం తగ్గిపోతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆటంకాలు లేనట్లేనని భావించిన తెలంగాణ ప్రభుత్వం … ప్రమాణాలు చేయించాలని నిర్ణయించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్‌ల పేర్లను రేవంత్ సర్కార్ ఏర్పడగానే సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోదించారు. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్న సమయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పేర్లను బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. గవర్నర్ తిరస్కరించారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ మళ్లీ సిఫారసు చేయలేదు. ఫలితంగా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఎన్నికల్లో ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం వేరే వారిని సిఫారసు చేసింది. అయితే తమకే చాన్సివ్వాలంటూ.. కుర్ర, దాసోజు కోర్టుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు గవర్నర్ ఆదేశాలను రద్దు చేసింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యారు. గవర్నర్ నిర్ణయం తీసుకునే అధికారాల్ని నియంత్రించలేరని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు మార్గం సుగమం అయింది.