కోడికత్తి శీను తల్లిదండ్రులు తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. తమ కుమారుడ్ని కాపాడాలని వేడుకుంటున్నారు. మూడున్నరేళ్లుగా జైల్లో ఉన్నాడని.. హత్యలు చేసిన వాళ్లకీ బెయిలొస్తోందని తమ కుమారుడు ఎందుకు ఇవ్వడం లేదని వాపోతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీకి లేఖ రాశారు. ఇంకా స్పందన లేదు. ఈ అంశంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాజకీయ చదరంగంలో కోడికత్తి శ్రీను ఓ టూల్గా ఉపయోగపడ్డాడు. కానీ ఇప్పుడు అతన్ని ఎవరూ రక్షించే పరిస్థితి లేదు. రక్షించకపోయినా లాభపడిన వాళ్లకు పోయేదేం లేదు. కానీ బలైపోతోంది మాత్రం ఆ నిరుపేద కుటుంబమే.
కోడికత్తి శీను జగన్ వీరాభిమాని అని జగమంతా తెలుసు. ఆయన ఇంటి చుట్టుపక్కల వారు.. ఇంట్లో ఫోటోలు మాత్రమే కాదు.. పోలీసులకు.. ఎన్ఐఏకు దొరికిన అన్ని ఆధారాలు అవే చెబుతున్నాయి. పోలీసులు తప్పు చెబుతున్నారని పోరాడి మరీ కేసును ఎన్ఐఏకి ఇప్పించారు వైసీపీ పెద్దలు. ఆ తర్వాత కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లింది. ఇప్పటి వరకూ తేలలేదు. ఆ శీనుకు బెయిల్ రాలేదు. జైల్లోనే మగ్గిపోతున్నాడు. అది ఎన్ఐఏ కేసు కావడంతో బెయిల్ రావడం కష్టంగా మారింది.
కోడికత్తి శీను .. తాను జగన్ పై సానుభూతి రావడానికే దాడి చేశానని స్టేట్ మెంట్ ఇచ్చారు.. ఆయన లక్ష్యం నెరవేరింది. చిన్న కత్తి గాటు నుంచి పెద్ద డ్రామా సృష్టించి.. ” అమ్మా… ” అన్న గావు కేకల్ని కొన్ని మీడియాల్లో వినిపించి ఎన్నికల్లో కావాల్సినంత లబ్దిపొందారు. శీను అనుకున్నట్లుగానే జగన్కు ఊహించనంత సానుభూతి మెజార్టీ లభించింది. కానీ సమిథగా మారిపోయింది శీను మాత్రమే. ఇప్పుడు ఆయనకు బెయిల్ రావడం కష్టంగా మారింది. వైసీపీ తరపున సాయం అందడం లేదు. అంతే కాదు కేసును కూడా ముందుకు సాగనీయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. విచారణ చేస్తే.. అసలు ఈ కోడికత్తి స్క్రిప్ట్ రచయిత ఎవరో బయటపడే అవకాశం ఉందని చెబుతుననారు.
మరో వైపు కోడికత్తి శీను కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అనేక మేళ్లు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆ కుటుంబం మాత్రం పూర్తిగా కుంగిపోతోంది. రాజకీయంతో ఓ యువకుడి భవిష్యత్ అంధకారం అయిపోయిందన్న వాదన మాత్రం వినిపిస్తోంది. ఆయన వల్ల లాభపడిన వాళ్లు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.