ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్దమైంది. లీగ్ మ్యాచ్ లు పూర్తి కావడంతో మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ – కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ విభాగాల్లో అల్ రౌండర్ ప్రదర్శనను కనబరచడంతో ఈ మ్యాచ్ లో ఎవరిది పైచేయిగా నిలుస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
లీగ్ స్టేజ్ లో 14 మ్యాచ్ ల్లో కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడిన కోల్ కత్తా 20 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. హైదరాబాద్ జట్టు 8మ్యాచ్ లలో విజయం సాధించి.. ఐదింట్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో 17పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో వరుసగా ఫస్ట్ ,సెకండ్ ప్లేసులో నిలిచిన ఇరు జట్లు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ లో తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్ బెర్త్ కన్ఫాం చేసుకోవాలని ఇరు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లో స్వల్ప తేడాతో హైదరాబాద్ ను ఓడించిన కోల్ కత్తాను ఈ మ్యాచ్ లో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్ళాలని కమ్మిన్స్ సారధ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్స్ లో తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా ఉండటంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. టాస్ సగం మ్యాచ్ ను నిర్దేశించనుంది. ఎందుకంటే హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్లు నమోదు చేస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు దంచికొడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో హైదరాబాద్ కు మొదట బ్యాటింగ్ ఇవ్వాలంటే ప్రత్యర్ధి జట్టు భయపడుతోంది. ఇక, పేస్ విబాగం బలంగా ఉన్నప్పటికీ స్పిన్ విభాగమే కొంత బలహీనంగా కనిపిస్తోంది.
ఇక, కోల్ కతా బ్యాట్స్ మెన్స్ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఓపెనర్ గా సునీల్ నరైన్ రాణిస్తూ, అల్ రౌండర్ ప్రతిభ కనిపిస్తుండటం ఆ జట్టుకు మరింత కలిసి వస్తోంది. మిడిల్ ఆర్డర్ లో నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్ లు రాణిస్తున్నారు. చివర్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేందుకు హార్డ్ హిట్టర్ అండ్రూ రసెల్ ఉండనే ఉన్నాడు. దీంతో కోల్ కత్తా కూడా అటు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణిస్తుండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.