కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని ఓ ఆటాడుతున్నారు. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. ఏం చేసినా తమను వదులుకోలేరన్న ధీమాతో ఆ పార్టీని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెట్టారు. చివరికి మునుగోడు ఉపఎన్నికతో కాంగ్రెస్ పీక నొక్కేయాలనుకున్నారు. అయినా కాంగ్రెస్ వారిని అలా చూస్తూండిపోయింది తప్ప చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోలేదు. తీసుకుంటే ఓ ఎంపీ తగ్గిపోతారని అనుకుంటున్నారేమో కానీ ఆయన మాత్రం తాను ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా లేనని చెప్పుకొచ్చారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ టీ పీసీసీ కమిటీలను ప్రకటించింది. 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని, ఉపాధ్యక్షుల్ని, జనరల్ సెక్రటరీస్ని.. అలాగే 26 జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించింది. ఈ జాబితాలో ఎక్కడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆయనకు సన్నిహితులనుకున్న వారినీ పక్కన పెట్టారు. ఆయన స్టార్ క్యాంపెయినర్ పదవి కూడా దీంతో పోయినట్లయింది. అంటే కోమటిరెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ కూడా పట్టించుకోవడం మానేసినట్లేనని భావిస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఆయనకు రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాటికి కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు. కానీ అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరోక్షంగా ఏ కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించకపోవడం ద్వారా.. ఆయనతో కాంగ్రెస్కుపని లేదని చెప్పినట్లయింది. ఈ కమిటీలతో టీ కాంగ్రెస్లో విభేదాలకు చెక్ పడుతుందని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు.